Perni Nani: సీఎం జగన్ పోలవరం పర్యటనలో పోలీసులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని... వీడియో ఇదిగో!

Minister Perni Nani fires on police in CM Jagan polavaram tour
  • కేంద్రమంత్రితో కలిసి పోలవరం వెళ్లిన సీఎం జగన్
  • పర్యటనలో పాల్గొన్న ఇన్చార్జి మంత్రి పేర్ని నాని
  • పేర్ని నాని కారు తొలగించాలన్న పోలీసులు
  • పోలీసులపై నిప్పులు చెరిగిన మంత్రి పేర్ని నాని
  • ఏం... తమాషాగా ఉందా? అంటూ ఫైర్
ఏపీ సీఎం జగన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరంలో పర్యటించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇన్చార్జి మంత్రి పేర్ని నాని కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు అధికారులపై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. ప్రోటోకాల్ సిబ్బంది పేర్ని నాని వాహనాన్ని అక్కడి నుంచి తొలగించాలని చెప్పడమే ఆయన ఆగ్రహానికి కారణం. 

"మంచీ మర్యాదా ఉండక్కర్లా... ఎవరి డిజిగ్నేషన్ ఏంటో తెలియదా? ఈ కార్లు ఎవరివి? ఇది ఎవరి కారు? తమాషాలు చేస్తున్నారా? కారు తీయమన్నది ఎవరూ? ఏం తమాషాగా ఉందా? ఎవరి కారు నువ్వు తీయమన్నది? గుర్తుపెట్టుకో... నేను ఇన్చార్జి మంత్రిని! ఇవాళతో పండుగ అయిపోదు" అంటూ నిప్పులు చెరిగారు. 

ఓ పోలీసు అధికారి మంత్రి పేర్ని నానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. "మా సారు చెప్పింది మీకు చెప్పాం" అని ఆ అధికారి తెలిపారు. అయినప్పటికీ మంత్రి పేర్ని నాని శాంతించలేదు సరికదా, మరింత ఆవేశానికి లోనయ్యారు. "ఏయ్... ఒకడు చెప్పేదంటయ్యా! మీ ఎస్పీ కారు, డీఐజీ కారు ఇక్కడెందుకు ఉంటాయ్?" అంటూ మండిపడ్డారు. 

దాంతో ఆ అధికారి... "మా ఉన్నతాధికారులు వస్తున్నారు సార్" అంటూ మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు. అప్పటికి కూడా మంత్రి పేర్ని నాని కోపం తగ్గలేదు. "వస్తే రమ్మను... నాకన్నా ఎన్ని డిజిగ్నేషన్లు తక్కువ వాళ్లు... మర్యాదగా ఉండదు" అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
Perni Nani
Police
Anger
Polavaram Project
CM Jagan
Gajendra Singh Shekhawat
YSRCP
Andhra Pradesh

More Telugu News