YS Vivekananda Reddy: నా తండ్రి హత్యను రాజకీయంగా వాడుకుని జగన్ లబ్ధిపొందారు: వివేకా కుమార్తె సంచలన వాంగ్మూలం

Doctor Sunitha Statement comes into light on vivekas murder
  • హత్య గురించి చెబితే జగన్, భారతి చాలా తేలిగ్గా తీసుకున్నారు
  • నా భర్తపైనే అభాండాలు మోపారు
  • చిన్నాన్న కంటే కాంపౌడర్‌కే విలువిచ్చారు
  • సీబీఐతో విచారణ జరిపిస్తే అవినాశ్ రెడ్డి బీజేపీలో చేరుతాడన్నారు
  • రూ. 104 కోట్ల వ్యవహారం కూడా హత్యకు కారణమై ఉండొచ్చన్న డాక్టర్ సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో ఆయన కుమార్తె డాక్టర్ సునీత 7 జులై 2020న సీబీఐ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది. ఇందులో పలు కీలక విషయాలను ఆమె వెల్లడించారు. తన తండ్రిని చంపిన హంతకులు వారే అయి ఉండొచ్చంటూ అన్న (జగన్) వద్ద కొందరి పేర్లను ప్రస్తావించానని, దానికి ఆయన ఇచ్చిన సమాధానం తనను ఆశ్చర్యపరిచిందని అన్నారు. వారిని అనవసరంగా అనుమానించొద్దని అన్నారని పేర్కొన్నారు.

దీంతో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరానని చెప్పారు. అందుకు జగన్ బదులిస్తూ.. సీబీఐతో దర్యాప్తు చేయిస్తే ఏమవుతుందని, అవినాశ్‌రెడ్డి బీజేపీలో చేరుతాడని, అతడికేమీ కాదని అన్నారని సునీత చెప్పారు. ప్రస్తుతం ఉన్న 11 కేసులకు మరోటి తోడవుతుంది తప్పితే ఒరిగేదీమీ ఉండదని జగన్ చెప్పడం తనను తీవ్రంగా బాధించిందని అన్నారు. అంతేకాదు.. వాళ్లను అనుమానించొద్దని, బహుశా నీ భర్తే హత్య చేయించాడేమోనని అనడంతో తన గుండె పగిలినంత పనైందని పేర్కొన్నారు.  

అనుమానితుల జాబితాలో ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో పనిచేసే కాంపౌండర్ ఉదయ్ కుమార్‌రెడ్డి పేరు చేర్చడంపైనా జగన్ కోప్పడ్డారని అన్నారు. సొంత చిన్నాన్న ప్రాణం కన్నా కాంపౌండరే ఆయనకు ఎక్కువ అయ్యారని పేర్కొన్నారు. తన తండ్రి చనిపోయిన విషయం తెలిసి సంబరాలు చేసుకునేందుకు బాణసంచా కొనుగోలు చేసిన వ్యక్తిని ఎలా వదిలిపెట్టారో అర్థం కావడం లేదన్నారు. 

తనకు న్యాయం లభించదన్న ఉద్దేశంతోనే సీబీఐ విచారణకు హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. తన తండ్రిపై కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి రాజకీయ కక్ష పెంచుకున్నారని చెప్పారు. హత్య విషయాన్ని తొలుత భారతికి, ఆ తర్వాత జగన్‌కు ఫోన్ చేసి చెబితే.. అవునా..? అంటూ చాలా తేలిగ్గా స్పందించారని, వారిలో ఇసుమంతైనా బాధ కనిపించలేదని అన్నారు. 

తండ్రి మరణవార్త తెలిసిన తాము పులివెందులకు బయలుదేరామని, తాము వచ్చే వరకు మృతదేహానికి పోస్టుమార్టం చేయొద్దని చెప్పానని, అయినప్పటికీ కాసేపటి తర్వాత ఫోన్ చేసి పోస్టుమార్టం పూర్తయిందని, కుట్లువేసి కుట్టేశారని చెప్పారని డాక్టర్ సునీత పేర్కొన్నారు. అంతేకాదు, ఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేశారని తెలిసిందన్నారు. నాన్నకు సన్నిహితుడైన ఎంవీ కృష్ణారెడ్డితో కేసు పెట్టించొద్దని ఎర్ర గంగిరెడ్డి చెప్పాడని అనడంతో హత్య జరిగిందని నిర్ధారించుకున్నట్టు చెప్పారు.

నాన్న హత్యతో ఎన్నికల్లో జగన్ లాభపడ్డారని, హత్యను సానుభూతి కోసం వాడుకుని ప్రయోజనం పొందారని అన్నారు. తన తండ్రి హంతకులను శిక్షించాలని అన్న జగన్‌ను, సజ్జల, సవాంగ్ తదితరుల సమక్షంలో బతిమాలినట్టు గుర్తు చేసుకున్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డిని అనుమానితుల జాబితాలో చేర్చడంపై జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఎంవీ కృష్ణారెడ్డి (వివేకా పీఏ) ద్వారా నీ భర్త రాజశేఖర్‌రెడ్డే హత్య చేయించాడని ఎందుకు అనుకోకూడదని అనడంతో జగన్‌తో వాగ్వివాదానికి దిగానని చెప్పారు.

సీబీఐతో విచారణ జరిపిస్తే దోషులు ఎవరో తేలుతుందని చెబితే, అలా ఏమీ జరగదని, అవినాశ్ వైసీపీని వీడి బీజేపీలో చేరుతాడని అంతకుమించి మరేమీ జరగదని అన్నారు. అంతేకాదు, ఇప్పటికే ఉన్న 11 కేసులకు మరోటి చేరుతుందని చెప్పడంతో ఆశ్చర్యపోయానని అన్నారు. తనకు తెలిసినంత వరకు.. భరత్ యాదవ్, సునీల్ యాదవ్‌తో కలిసి తన తండ్రి రూ. 104 కోట్ల వ్యవహారాన్ని సెటిల్ చేశారని, అందులో తన తండ్రికి రూ. 4 కోట్లు వచ్చాయని అన్నారు. అందులో భరత్, సునీల్ వాటా డిమాండ్ చేస్తే కోటిన్నర రూపాయలకు ఎక్కువ ఇవ్వనని తేల్చి చెప్పారని, తన తండ్రి హత్యకు బహుశా ఇది కూడా ఓ కారణం అయి ఉంటుందన్నారు.  

తన తండ్రి, పెదనాన్న (రాజశేఖరరెడ్డి)కి ఉమ్మడిగా ఉన్న 600 ఎకరాలను జగన్, షర్మిల, తనకు సమానంగా తలా 200 ఎకరాలు పంచారని, ఆ తర్వాత ఎకరం లక్ష చొప్పున తన నుంచి ఆ ఆస్తిని వెనక్కి తీసుకున్నారని అన్నారు. అవినాశ్‌తో తన భర్త కుమ్మక్కయినట్టు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఆస్తి మొత్తానికి తానే వారసురాలినని డాక్టర్ సునీత చెప్పుకొచ్చారు.
YS Vivekananda Reddy
Jagan
Sunitha
Murder Case
Pulivendula
CBI

More Telugu News