Rohit Sharma: పరుగుల్లో టాప్.. కొత్త రికార్డులు సెట్ చేసిన రోహిత్ శర్మ

Rohit Emerged As A Top Run Scorer In T20s
  • శ్రీలంకతో మ్యాచ్ లో పలు రికార్డులు
  • 3,307 రన్స్ తో అగ్రస్థానం
  • గప్తిల్, కోహ్లీని అధిగమించిన కెప్టెన్
  • కెప్టెన్ గా పది వరుస విజయాలు
  • టీమిండియాకు తొలిసారి ఈ ఘనత
నిన్న శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో  కెప్టెన్ గా, బ్యాటర్ గా రోహిత్ శర్మ.. కొత్త శిఖరాలు, రికార్డులను అధిరోహించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో రోహిత్.. 44 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో అతడి మొత్తం పరుగులు 3,307కు చేరాయి. 123 మ్యాచ్ లలో (115 ఇన్నింగ్స్ లు) అతడు ఈ ఘనతను అందుకున్నాడు. దీంతో తనకన్నా ముందున్న న్యూజిలాండ్ బ్యాటర్ మార్టిన్ గప్తిల్ (3,299), టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ (3,296 పరుగులు)ను దాటేశాడు.

మరోవైపు కెప్టెన్ గా వరుసగా 10 మ్యాచ్ లలో నెగ్గిన ఘనత సాధించాడు. పది వరుస విజయాలతో టీమిండియా తొలిసారి ఈ ఘనత సాధించినట్టయింది. అంతకుముందు 2020లో భారత్ వరుసగా 9 విజయాలను నమోదు చేసింది. ఈ ఫార్మాట్ లో వరుసగా అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో అతడు రెండో స్థానంలో ఉన్నాడు. ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ అస్గర్ ఆఫ్ఘన్ 12 మ్యాచ్ లలో గెలిచి ముందు వరుసలో ఉన్నాడు. అయితే, శ్రీలంకతో మిగతా రెండు మ్యాచ్ లలోనూ గెలిస్తే.. అస్గర్ ను రోహిత్ సమం చేస్తాడు.

మరోవైపు టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్ గా యుజ్వేంద్ర చాహల్ రికార్డు సృష్టించాడు. 53 ఇన్నింగ్స్ లలో 67 వికెట్లు తీశాడు. ఇప్పటిదాకా బుమ్రా పేరిట ఉన్న రికార్డును తిరిగి తన పేరిట రాసుకున్నాడు. బుమ్రా 55 ఇన్నింగ్స్ లలో 66 వికెట్లు తీశాడు.

ఇక, 83 ఓటములతో అత్యధిక ఓటములను మూటగట్టుకున్న జట్టుగా వెస్టిండీస్ తో కలిసి అగ్రస్థానంలో నిలిచింది శ్రీలంక జట్టు. 78 ఓటములతో బంగ్లాదేశ్, 76 ఓటములతో న్యూజిలాండ్ లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Rohit Sharma
Cricket
T20

More Telugu News