Packaged foods: ఆరోగ్యకరమో, కాదో ఫుడ్ ప్యాకెట్ ను చూసి తెలుసుకోవచ్చు!

Packaged foods to soon have health stars to inform buyers about nutrition profile
  • ఇకనుంచి ఉత్పత్తులపై స్టార్ రేటింగ్
  • త్వరలో అమలు చేయనున్న ఎఫ్ఎస్ఎస్ఏఐ
  • ఎక్కువ స్టార్లు ఉంటే ఆరోగ్యానికి మంచిది
ప్యాకేజ్డ్ ఫుడ్స్, రెడీ టు ఈట్ ఫుడ్స్ వినియోగం పెరిగిపోయింది. అవన్నీ కూడా ప్రాసెస్ చేసినవి. నిల్వ ఉండేందుకు వాటిల్లో ప్రిజర్వేటివ్స్ కలుపుతారు. ఇంకా ఎన్నో రకాల కెమికల్స్ కూడా ఉంటాయి. ఆరోగ్యంపై వీటి ప్రభావం కచ్చితంగా ఉంటుంది. కానీ, చాలా మందికి వీటి గురించి అవగాహన లేదు. ఇకపై ఈ ఇబ్బంది తప్పిపోనుంది.

వినియోగదారులు తాము కొనుగోలు చేస్తున్న ఆహార ఉత్పత్తి ఆరోగ్యానికి మంచిదా, కాదా? అన్న విషయాన్ని సులభంగా గుర్తించేందుకు స్టార్ రేటింగ్ రానుంది. మన ఇంట్లో రిఫ్రిజిరేటర్, ఏసీని గమనించండి. వాటిపై స్టార్ రేటింగ్ కనిపిస్తుంది. 5 స్టార్ ఉంటే విద్యుత్ ఆదా ఎక్కువ చేస్తుందని అర్థం. అలా ఒక్కోస్టార్ తగ్గుతున్న కొద్దీ విద్యుత్ వినియోగం పెరిగిపోతుందని అర్థం చేసుకోవచ్చు. ఈ స్టార్ రేటింగ్ ను భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) అమలు చేస్తోంది.

ఇదే మాదిరి ఇప్పుడు ఆహార ఉత్పత్తులకు హెల్త్ స్టార్ రేటింగ్ ను ఆహార భద్రత, ప్రమాణాల మండలి (ఎఫ్ఎస్ఎస్ఏఐ) అమల్లోకి తీసుకురానుంది. సదరు ఉత్పత్తిపై ఎన్ని స్టార్స్ ఉంటే అంత మంచిదని అర్థం చేసుకోవచ్చు. కొవ్వు పదార్థాలు, చక్కెర, ఉప్పు పరిమాణం ఆధారంగా స్టార్ రేటింగ్ ఉంటుంది.

‘‘వినియోగదారులు ఆహారోత్పత్తిలోని పోషకాల గురించి సులభంగా తెలుసుకునేందుకు ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, అహ్మదాబాద్ ఒక అధ్యయనం నిర్వహించింది. స్టార్ రేటింగ్, ట్రాఫిక్ లైట్ సంకేతాలు, న్యూట్రిషన్ స్కోరు, హెచ్చరిక గుర్తులను పరిశీలించింది. వినియోగదారులు సులభంగా అర్థం చేసుకునేందుకు వీలుగా స్టార్ రేటింగ్ ను సూచించింది’’ అని ఎఫ్ఎస్ఎస్ఏఐ సీఈవో అరుణ్ సింఘాల్ తెలిపారు.
Packaged foods
star rating
fssai

More Telugu News