Igor Polikha: ఇక మోదీనే జోక్యం చేసుకోవాలి... ఆయన చెబితే పుతిన్ వింటారు: ఉక్రెయిన్ రాయబారి ఆశాభావం

Ukraine envoy to India Igor Polikha asks Modi intervention into present crisis
  • ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా 
  • పుతిన్ ఆదేశంతో బాంబుల వర్షం కురిపించిన రష్యా బలగాలు
  • భారత్ వైపు చూస్తున్న ఉక్రెయిన్
  • మోదీ శక్తిమంతమైన నేత అంటున్న ఉక్రెయిన్ రాయబారి
ఉక్రెయిన్ పై సైనిక చర్య పేరుతో రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ వంటి అగ్రరాజ్యాల దేశాధినేతలు చెప్పినా పుతిన్ ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. ఈ నేపథ్యంలో భారత్ లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా స్పందించారు.

ప్రస్తుతం నెలకొన్న సంక్షుభిత పరిస్థితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకోవాలని కోరారు. మోదీ చెబితే రష్యా అధ్యక్షుడు పుతిన్ సానుకూలంగా వినే అవకాశాలున్నాయని భావిస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే మోదీ అత్యంత శక్తిమంతమైన నాయకుడు అని, ఆయనను ప్రతి ఒక్కరూ గౌరవిస్తారని వివరించారు.

మోదీ వెంటనే స్పందించి రష్యా అధ్యక్షుడు పుతిన్ తో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో మాట్లాడాలని పొలిఖా విజ్ఞప్తి చేశారు. పుతిన్ ఎవరి మాట వినకపోయినా మోదీ మాట వింటారన్న నమ్మకం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

"రష్యా దళాలు ఉక్రెయిన్ లోని చాలా ప్రాంతాల్లోకి చొచ్చుకువచ్చాయి. మా సైనికులతో పాటు సాధారణ పౌరులు కూడా రష్యా బలగాల దాడుల్లో చనిపోయినట్టు తెలుస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లో భారత్ మాకు అండగా నిలవాలి. దౌత్యపరమైన విషయాల్లో భారత్ కు ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. శాంతిస్థాపనకు భారత్ ఎప్పుడూ ముందుంటుంది" అని పొలిఖా వివరించారు.
Igor Polikha
Narendra Modi
Ukraine
Vladimir Putin
Russia
War

More Telugu News