Russia: 'అబ్బో.. మేధావి' అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

Trump Applause Russia President Putin Says Genius
  • ఉక్రెయిన్ తో ఘర్షణల నడుమ కామెంట్
  • రెండు స్వతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేయడం తెలివైన నిర్ణయమని ప్రశంస
  • శాంతి కాముకుడిగా మారాడంటూ ట్రంప్ వ్యాఖ్య
ఉక్రెయిన్ పై యుద్ధానికి తహతహలాడుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ప్రపంచ దేశాలు ఆగ్రహావేశాలతో ఊగిపోతుంటే.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ప్రశంసలు కురిపించారు. 'పుతిన్ మేధావి' అంటూ వ్యాఖ్యానించాడు. ఉక్రెయిన్ లోని డానెట్స్క్, లుహాన్స్క్ లను స్వతంత్ర రాజ్యాలుగా ప్రకటించడం తెలివైన చర్య అంటూ పేర్కొన్నారు. ద క్లే ట్రావిస్ అండ్ బక్ సెక్స్టాన్ షోలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్లు చేశారు.

ఉక్రెయిన్ లోని భారీ భూభాగాన్ని స్వతంత్ర రాజ్యాలుగా పుతిన్ ప్రకటించడాన్ని టీవీలో చూశానని పేర్కొన్నారు. అది అద్భుతమైన చర్య అన్నారు. ఆ నిర్ణయం ఎంత తెలివైనదంటే.. రెండు స్వతంత్ర రాజ్యాలుగా విడగొట్టి పుతిన్ స్వయంగా శాంతి కాముకుడిగా నిలిచిపోతారని చెప్పారు. అది అత్యంత శక్తిమంతమైన శాంతి కాముక బలగమని వ్యాఖ్యానించారు. అలాంటి చర్యలను అమెరికా దక్షిణాది సరిహద్దుల్లోనూ తీసుకోవాలన్నారు.

పుతిన్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని, ఆయన గురించి తనకు బాగా తెలుసని ట్రంప్ చెప్పారు. కాగా, రష్యా రెచ్చగొట్టే చర్యలతో ఇప్పటికే అమెరికా, బ్రిటన్, కెనడా, ఐరోపా దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
Russia
USA
Vladimir Putin
Donald Trump

More Telugu News