Rohit Sharma: కొత్త వైస్ కెప్టెన్ గా బుమ్రా.. హర్షం వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ
- బుమ్రాలో క్రికెటింగ్ నైపుణ్యాలు భేష్
- అతడి గురించి నాకు బాగా తెలుసు
- అది అతడికే మంచిదన్న రోహిత్
- ఆ ముగ్గురూ కెప్టెన్ రేసులో ఉన్నారంటూ కామెంట్
గాయం కారణంగా శ్రీలంకతో టీ20లు, టెస్ట్ మ్యాచ్ లకు వైస్ కెప్టెన్ కె.ఎల్. రాహుల్ దూరమైన సంగతి తెలిసిందే. దీంతో టీమిండియా ఏస్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్ గా ప్రకటించింది జట్టు యాజమాన్యం. దీనిపై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ, సెలెక్షన్ కమిటీ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశాడు. జట్టుకు నాయకుడు బౌలరా? బ్యాటరా? అన్నది తనకు అనవసరమని, క్రికెటింగ్ నైపుణ్యాలు, మెళకువలు ఉన్నాయా? లేవా? అన్నదే తనకు ముఖ్యమని చెప్పాడు.
బుమ్రాలో అవన్నీ ఉన్నాయని, అతడు లీడర్ షిప్ రోల్ లోకి రావడం హర్షణీయమని పేర్కొన్నాడు. బుమ్రా ఏంటో, అతడి నైపుణ్యాలేంటో తనకు బాగా తెలుసని తెలిపాడు. లీడర్ షిప్ పాత్ర పోషించడం అతడికి చాలా మంచిదని, తన కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లాడని చెప్పాడు. మున్ముందు కూడా దానిని ఇలాగే కొనసాగిస్తాడని ఆశిస్తున్నానన్నాడు. కొత్త బాధ్యత బుమ్రాలో మరింత విశ్వాసాన్ని ప్రోధి చేస్తుందని రోహిత్ ధీమా వ్యక్తం చేశాడు. జట్టుకు వైస్ కెప్టెన్ గా ఉండడం చాలా మంచిదన్నాడు.
బుమ్రా, రాహుల్, పంత్ లను తదుపరి కెప్టెన్లుగా పరిగణిస్తున్నారంటూ రోహిత్ స్పష్టం చేశాడు. ఈ ముగ్గురు భవిష్యత్ లో టీమిండియాలో కీలకంగా ఉంటారని చెప్పాడు. ఆ ముగ్గురూ కెప్టెన్ రేసులో ఉన్నారన్నాడు. తాను ఎలాంటి పాత్రలోనైనా జట్టుకు తనవంతు సహకారం అందించేందుకు సిద్ధమని రోహిత్ చెప్పాడు. కెప్టెన్ గా అవకాశం రావడం తనకు లభించిన గౌరవమన్నాడు. తన సామర్థ్యానికి తగ్గట్టు జట్టుకు సేవలందిస్తానని పేర్కొన్నాడు.