Prakash Raj: సీఎం కేసీఆర్ బృందంలో ప్రకాష్ రాజ్.. బీజేపీ వ్యతిరేక కూటమిలో కీలక పాత్ర!

Prakash Raj in Telangana CM K Chandrasekhar Raos Mumbai meet a surprise move
  • మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ వెంట ప్రకాష్ రాజ్
  • 2018లో దేవెగౌడతో భేటీకి కూడా హాజరు
  • త్వరలో తమిళనాడు పర్యటనలో ఉండే అవకాశం

ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడల్లా ప్రకాష్ రాజ్ ను వెంట తీసుకెళుతున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటనలోనూ ప్రకాష్ రాజ్ దర్శనమిచ్చారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రాంతీయ శక్తులను ఒక దగ్గరకు చేర్చే ప్రయత్నాలను కేసీఆర్ ఇటీవల మొదలు పెట్టడం తెలిసిందే. గతంలోనూ ఈ  తరహా ప్రయత్నాలు చేశారు కానీ, అంతగా ముందుకు తీసుకెళ్లలేదు.

సీఎం కేసీఆర్ తలపెట్టిన బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషించనున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే వ్యక్తిగా ప్రకాష్ రాజ్ పరిచయమే. బీజేపీ సర్కారును పలు అంశాల్లో ఆయన విమర్శించారు కూడా. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ప్రకాష్ రాజ్ ఓటమి చవిచూశారు. ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు.

సీఎం కేసీఆర్, ప్రకాష్ రాజ్ ఆదివారం ముంబైలో యాదృచ్ఛికంగా కలుసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే ప్రత్యామ్నాయ ఫ్రంట్ లో ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదని అంటున్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించి, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రకాష్ రాజ్ తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ తర్వాత 2018 ఏప్రిల్ లో దేవగౌడతో సీఎం కేసీఆర్ భేటీ సందర్భంలోనూ ప్రకాష్ రాజ్ ఉన్నారు.

అంతేకాదు, త్వరలో సీఎం కేసీఆర్ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ను కలవనున్నారు. స్టాలిన్ తో ప్రకాష్ రాజ్ కు సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో సీఎం కేసీఆర్ తమిళనాడు పర్యటనలోనూ ప్రకాష్ రాజ్ పాల్గొంటారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News