Sachin Tendulkar: సచిన్ కు కోహ్లీ ఇచ్చిన విలువైన బహుమతి.. తిరిగిచ్చేసిన లెజెండ్

Sachin Tendulkar Recalls Emotional Moment When He Returned Virat Kohlis Gift
  • సచిన్ రిటైర్మెంట్ నాటి ఘటన
  • పవిత్ర దారాన్ని సచిన్ కు ఇచ్చిన కోహ్లీ
  • అది వాళ్ల నాన్న ఇచ్చినది
  • చివరి శ్వాస వరకు ఇది నీ దగ్గరే ఉండాలన్న సచిన్
భారతరత్న, లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ రిటైర్మెంట్ సమయంలో భావోద్వేగానికి గురిచేసిన సంఘటన ఒకటి ఉంది. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విలువైన వస్తువు ఒకదానిని ఎంతో ప్రేమతో బహుమానంగా ఇచ్చాడు. అయినా, సచిన్ ఉంచుకోకుండా వెనక్కిచ్చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సచిన్ అమెరికన్ జర్నలిస్ట్ గ్రాహమ్ బెన్సింగర్ తో పంచుకున్నారు.

2013లో సచిన్ టెండుల్కర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేశాడు. దేశంలో కోట్లాది మంది ప్రజలకు సచిన్ ఆరాధ్య క్రికెటర్ గా ఎదిగిన విషయం తెలిసిందే. అంతేకాదు, క్రికెటర్లలోనూ ఎంతో మంది సచిన్ ను ఎంతో ఇష్టపడుతుంటారు. అటువంటి వారిలో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. అప్పుడు కోహ్లీ కెరీర్ ఆరంభంలో ఉన్నాడు. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి బాధను ఆపుకోలేకపోతున్న సందర్భంలో కోహ్లీ ఒక చిన్న కానుక ద్వారా తన అభిమానాన్ని చాటుకున్నాడు.

‘‘నేను ఒంటరిగా ఒక మూలన కూర్చున్నాను. నా తలపై టవల్ ఉంది. కంటి వెంట వస్తున్న నీళ్లను తుడుచుకుంటున్నాను. ఆ సమయంలో విరాట్ నా దగ్గరకు వచ్చాడు. ఒక పవిత్ర దారాన్ని నాకు ఇచ్చాడు. అది అతడికి వాళ్ల నాన్న ఇచ్చింది’’ అని సచిన్ వివరించాడు.

కోహ్లీ ఆ తాడును సచిన్ కు ఇస్తూ.. ‘‘సాధారణంగా చేతి మణికట్టుకు మనం ఏదో ఒకటి ధరిస్తుంటాం. భారత్ లో చాలా మంది ఇలానే చేస్తారు. మా నాన్న నాకు కూడా ఒకటి ఇచ్చారు. దానిని నా బ్యాగ్ లోనే ఉంచేసుకున్నాను. నా దగ్గరున్న విలువైనది అదేనన్నది నా అభిప్రాయం. మా నాన్న నాకు ఇచ్చినది. కనుక అంతకంటే విలువైనది నేను మీకు ఏదీ ఇవ్వలేను. మీరు నాకు ఎంత స్ఫూర్తినిచ్చారో తెలియజేయాలనుకుంటున్నాను. ఇది నేను ఇచ్చే చిన్న కానుక’’ అని కోహ్లీ ఆ సందర్భంలో సచిన్ కు చెప్పాడట.

‘‘దానిని నా దగ్గరే కొద్ది సేపు ఉంచుకుని విరాట్ కు తిరిగి ఇచ్చేశాను. ‘ఇది అమూల్యమైనది. ఇది నీ దగ్గరే ఉండాలి. ఇంకెవరి దగ్గరా కాదు. ఇది నీ ఆస్తి. నీ చివరి శ్వాస వరకు నీ దగ్గరే ఉండాలి’ అని చెబుతూ వెనక్కిచ్చేశాను. అది నన్ను ఎంతో భావోద్వేగానికి గురిచేసిన సందర్భం. నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది’’ అని సచిన్ వెల్లడించారు.  
Sachin Tendulkar
Virat Kohli
gift
sacred thread
retirement

More Telugu News