Sandhya Mukharjee: పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన బెంగాలీ దిగ్గజ గాయని సంధ్య ముఖర్జీ కన్నుమూత

Veteran Singer Sandhya Mukherjee Passes Away
  • గత నెల 27 నుంచి ఆసుపత్రిలో చికిత్స
  • గత రాత్రి గుండెపోటుతో కన్నుమూత
  • ఎస్‌డీ బర్మన్, నౌషాద్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో పనిచేసిన సంధ్య
గత నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన దిగ్గజ గాయని సంధ్య ముఖర్జీ నిన్న కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. దక్షిణ కోల్‌కతాలోని తన ఇంట్లోని స్నానాల గదిలో కాలు జారి పడిన ఆమె గత నెల 27న ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి చికిత్స పొందుతున్నారు. సంధ్య ముఖర్జీకి చేసిన పరీక్షల్లో కరోనా సోకినట్టుగానూ నిర్ధారణ అయింది. అలాగే, అవయవాలు సరిగా పనిచేయకపోవడమేకాక ఎముక విరిగినట్టు కూడా వైద్యులు గుర్తించారు.

గత రాత్రి ఏడున్నర గంటల సమయంలో గుండె పోటుతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఎస్‌డీ బర్మన్, నౌషాద్, సలీల్ చౌధురి వంటి ప్రముఖ సంగీత దర్శకులతో కలిసి పనిచేసిన సంధ్య.. బంగ్ బిభూషణ్, ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తిరస్కరించి వార్తల్లోకి ఎక్కారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా తదితరులు సంతాపం ప్రకటించారు.
Sandhya Mukharjee
West Bengal
Bengali Singer

More Telugu News