Road Accident: ముందున్న కంటెయినర్​ ను ఢీకొట్టిన కారు.. ఆ కారును వెనుక నుంచి ఢీకొట్టిన ట్రక్కు.. కారులో ప్రయాణిస్తున్న నలుగురి మృతి!

Six Vehicles Involved In Road Mishap Killing 4 On Spot
  • మహారాష్ట్రలోని ఖండావాలా ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం
  • ఒకదానినొకటి ఢీకొట్టిన ఆరు వాహనాలు
  • 8 మందికి గాయాలు.. అందులో ముగ్గురి పరిస్థితి విషమం
మహారాష్ట్రలోని ఖండావాలా ఘాట్ రోడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటెయినర్ ను ఓ కారు ఢీకొట్టగా.. ఆ కారును వెనకే వచ్చిన మరో ట్రక్కు ఢీకొట్టేసింది. ఈ ప్రమాదంలో రెండు ట్రక్కుల మధ్య కారు నుజ్జునుజ్జయిపోయింది. ఆ కారులోని నలుగురు అక్కడికక్కడే మరణించారు. ముంబై–పూణె ఎక్స్ ప్రెస్ వేపై ఘాట్ లోనొ ఖోపోలి ఎగ్జిట్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో వరుసగా ఆరు వాహనాలు ఒకదాని వెనక మరొకటి ఢీకొట్టుకున్నాయి.

ఘటనలో మరో 8 మంది గాయపడగా.. తీవ్రగాయాలైన ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే ఖోపోలి ఏరియా ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నవారిని ఎంజీఎం కామోతి ఆసుపత్రికి తరలించారు. రెండు ట్రక్కుల మధ్య ఇరుక్కుపోయిన కారును క్రేన్ సాయంతో బయటకు తీశారు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను బయటకు తీసేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

చనిపోయిన వారిని గౌరవ్ ఖారత్ (36), సౌరభ్ తులసి (32), సిద్ధార్థ్ రాజగురు (31)గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియరాలేదు. అతివేగంతో వెళ్తున్న ట్రక్కు టైరు పంక్చర్ కావడంతో రోడ్డు మధ్యలో నిలిచిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వెనకే వస్తున్న కారు అదుపుతప్పి ఢీకొట్టిందని, ఆ వెంటనే కారు వెనక నుంచి మరో ట్రక్కు ఢీకొట్టిందని చెప్పారు. ఒక కంటెయినర్, రెండు ట్రక్కులు, రెండు కార్లు, ఒక టెంపో ప్రమాదానికి గురయ్యాయన్నారు.
Road Accident
Maharashtra
Vehicles
Ghat Road

More Telugu News