Chiranjeevi: శబరిమల, గురువాయూర్ ఆలయాలను సందర్శించిన మెగాస్టార్ చిరంజీవి... ఫొటోలు ఇవిగో!
- కేరళ పర్యటనకు వెళ్లిన చిరంజీవి దంపతులు
- తొలుత శబరిమల ఆలయ సందర్శన
- డోలీ ద్వారా కొండపైకి చేరుకున్న చిరంజీవి
- డోలీ మోసిన కూలీలకు కృతజ్ఞతలు
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించారు. సతీసమేతంగా కేరళ వెళ్లిన చిరంజీవికి అక్కడి వర్గాలు సాదర స్వాగతం పలికాయి. తొలుత శబరిమల వెళ్లిన చిరంజీవి దంపతులు అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. కొండ కింది భాగం నుంచి చిరంజీవి డోలీ ద్వారా అయ్యప్ప సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా డోలీ ద్వారా మోసిన అక్కడి కూలీలకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
చాలాకాలం తర్వాత ఇక్కడికి వచ్చానని, భక్తులు, అభిమానుల తాకిడి ఉంటుందని డోలీలో రావాల్సి వచ్చిందని చిరంజీవి వివరణ ఇచ్చారు.
అనంతరం చిరంజీవి, సురేఖ గురువాయూర్ చేరుకుని అక్కడి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకున్నారు. ఆపై గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శించారు. అక్కడి శ్రీకోవిల్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వర్గాలు చిరంజీవికి ప్రత్యేక జ్ఞాపికను బహూకరించాయి. చిరంజీవి కేరళ పర్యటనకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.