Ishan Kishan: ఐపీఎల్ వేలం: ఇషాన్ కిషన్ కోసం రూ.15.25 కోట్లు కుమ్మరించిన ముంబయి

Mumbai Indians grabs Ishan Kishan for a huge amount
  • కిషన్ పై నమ్మకం ఉంచిన అంబానీలు
  • సుందర్ ను కొనుగోలు చేసిన సన్ రైజర్స్
  • లంక మిస్టరీ స్పిన్నర్ కు వేలంలో రూ.10.75 కోట్లు
  • హసరంగను కొనుగోలు చేసిన ఆర్సీబీ
ఇవాళ్టి ఐపీఎల్ వేలంలో ఇప్పటివరకు అత్యధిక ధర పొందిన ఆటగాడు ఇషాన్ కిషన్. ఈ టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ కోసం వేలంలో హోరాహోరీ నెలకొంది. ఎంతో పొదుపుగా డబ్బు ఖర్చు చేస్తుందని పేరున్న సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా ఇషాన్ కిషన్ కోసం ఓ దశలో రూ.14 కోట్ల వరకు వచ్చింది. అయితే ముంబయి ఇండియన్స్ అందరికంటే ఎక్కువగా రూ.15.25 కోట్లకు ఇషాన్ కిషన్ ను దక్కించుకుంది.

విధ్వంసక ఇన్నింగ్స్ లు ఆడడంలో దిట్టగా ఇషాన్ కిషన్ పేరు తెచ్చుకున్నాడు. ఇటీవల నిలకడగా ఆడుతున్న ఆటగాళ్లలో కిషన్ కూడా ఉన్నాడు. అందుకే అతడికి అంత ధర పలికిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ ఈ వేలంలో భారీ ధర సొంతం చేసుకున్నాడు. హసరంగను రూ.10.75 కోట్లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సొంతం చేసుకుంది. స్పిన్ ఆడడంలో దిట్టలుగా పేరుగాంచిన టీమిండియా బ్యాట్స్ మెన్ సైతం గత లంక పర్యటనలో హసరంగ బౌలింగ్ ఎదుర్కోవడంలో తడబడ్డారు. బౌలింగ్ లో వైవిధ్యం, కచ్చితత్వం, బ్యాట్స్ మన్ ఎవరైనాగానీ నిబ్బరంగా బంతులు విసిరే తత్వం హసరంగను కొద్దికాలంలోనే ఐసీసీ ర్యాంకుల్లోనూ అగ్రస్థానంలో నిలిపాయి.

ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నేటి వేలంలో ఓ ఆల్ రౌండర్ కోసం భారీగా వెచ్చించింది. ఆ ఆల్ రౌండర్ ఎవరో కాదు... వాషింగ్టన్ సుందర్. ఇటీవల కాలంలో భారత విజయాల్లో తరచుగా వినిపిస్తున్న పేరు ఇతడిదే. ఆస్ట్రేలియా పర్యటన నుంచి జట్టులో కొనసాగుతున్న సుందర్ బ్యాట్స్ మన్ గానూ, బౌలర్ గానూ జట్టుకు ఉపయోగపడుతున్నాడు. తమిళనాడుకు చెందిన వాషింగ్టన్ సుందర్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ నేటి వేలంలో రూ.8.75 కోట్ల ధరకు చేజిక్కించుకుంది.

ఇవాళ్టి వేలంలో భారీ ధర పలికిన మరికొందరు ఆటగాళ్లు వీరే...

  • కృనాల్ పాండ్య-రూ.8.25 కోట్లు (లక్నో సూపర్ జెయింట్స్)
  • అంబటి రాయుడు- రూ.6.75 కోట్లు (చెన్నై సూపర్ కింగ్స్)
  • జానీ బెయిర్ స్టో-రూ.6.75 కోట్లు (పంజాబ్ కింగ్స్)
  • మిచెల్ మార్ష్- రూ.6.5 కోట్లు (ఢిల్లీ క్యాపిటల్స్)
  • దినేశ్ కార్తీక్-రూ.5.50 కోట్లు (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు)

Ishan Kishan
Mumbai Indians
Auction
IPL

More Telugu News