Pawan Kalyan: ఉపాధి కల్పన అంటే సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, పొడిగించడం కాదు: పవన్ కల్యాణ్

Pawan Kalyan slams YCP Govt on unemployment issue in AP
  • ఏపీలో నిరుద్యోగుల ఆందోళనలు
  • జాబ్ క్యాలెండర్ విషయం ఏంచేశారన్న పవన్ 
  • నిలదీస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ఆగ్రహం
నిరుద్యోగ అంశంలో జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. "అధికారంలోకి వచ్చాక కొత్త సంవత్సర శుభాకాంక్షలతో పాటు జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తామని ముద్దులు పెట్టి మరీ చెప్పారు... ప్రతి ఏడాది 6 వేల పోలీసు ఉద్యోగాలు, 25 వేల టీచర్ పోస్టులు ఇస్తాను అని హామీ ఇచ్చారు... కానీ మెగా డీఎస్సీ లేదు, గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడంలేదు" అంటూ పవన్ విమర్శనాస్త్రాలు సంధించారు.

పరిపాలనలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత 10 వేల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వేసినా, ఇప్పటికీ అవి భర్తీ కాలేదని తెలిపారు. అధికారంలోకి వచ్చేందుకు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటిని నెరవేర్చడం మర్చిపోయారని వ్యాఖ్యానించారు. ఉద్యోగ హామీలపై నిలదీసేందుకు కలెక్టరేట్ల వద్దకు వెళ్లిన యువతపై లాఠీ చార్జీలు చేయించి అరెస్టులు చేయిస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో 30 లక్షల మంది వరకు నిరుద్యోగులు ఉన్నారని, వారందరికీ ఉద్యోగాలు కల్పించే కార్యాచరణ ఈ ప్రభుత్వం వద్ద ఉందా? అని ప్రశ్నించారు. వివిధ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వాళ్లు నోటిఫికేషన్లు లేకపోవడంతో వయో పరిమితి దాటిపోతోందన్న ఆందోళనలో ఉన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. యువత ఆందోళన అనేది ఈ ప్రభుత్వానికి అర్థమవుతోందా? అర్థమైనా కానీ అర్థం కానట్టు ఉందా? అని సందేహం వ్యక్తం చేశారు.

ఉపాధి కల్పన అంటే తమ వాళ్లకు సలహాదారు పోస్టులు ఇచ్చుకోవడం, వాటిని పొడిగించడం కాదు అని పాలకులు గుర్తించాలని జనసేనాని హితవు పలికారు. ఉద్యోగ నోటిఫికేషన్లపై సీఎం ఎన్నిసార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించి, ఏ నిర్ణయాలు తీసుకున్నారో యువతకు వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan
Unemployment
YCP Govt
Janasena
Andhra Pradesh

More Telugu News