Andhra Pradesh: ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందంటూ తండ్రీకొడుకుల కథ చెప్పిన మంత్రి పేర్ని నాని!

Minister Perni Nani said AP Economy decreased drastically
  • ఏపీ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని వ్యాఖ్యలు
  • ఆర్థిక పరిస్థితి బాగుంటే ఉద్యోగులతో గొడవ ఎందుకు పెట్టుకుంటామన్న మంత్రి
  • వచ్చిన డబ్బంతా ఉద్యోగుల జీతాలకు, అప్పులపై వడ్డీకే సరిపోతుందని ఆవేదన
  • పేదల సంక్షేమానికి ఏం చేద్దామని ఎదురు ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై మంత్రి పేర్ని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే కనుక ఇంతమందితో గొడవ ఎందుకు పెట్టుకుంటామని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడం వల్లే ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామని అన్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో  గత రాత్రి చర్చలు జరుగుతున్న సమయంలో ఫోన్ మాట్లాడేందుకు బయటకు వచ్చిన నాని ఈ వ్యాఖ్యలు చేశారు.

బయటకు వచ్చిన మంత్రిని కొందరు మహిళా ఉద్యోగులు.. ఐఆర్ 27 శాతం ఇచ్చి, ఫిట్‌మెంట్ 23 శాతానికి తగ్గించడం ఏంటని ప్రశ్నించారు. ఎప్పటి నుంచో ఉన్న హెచ్ఆర్ఏను ఇప్పుడు తగ్గించడం ఏంటన్నారు. మంత్రి బదులిస్తూ.. పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయితే స్కూటర్ కొని ఇస్తానని హామీ ఇచ్చిన తండ్రి.. ఆ సమయానికి దివాలా తీస్తే పరిస్థితి ఏంటని ఎదురు ప్రశ్నించారు. స్కూటర్ కొనిస్తానని కూడా ఇవ్వలేదని ఆ కొడుకు తిట్టుకుంటే అతడు ఏం చేయగలడని, ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి కూడా అలాగే ఉందని అన్నారు.

రాష్ట్రంలో 1.57 కోట్ల మంది తెల్ల రేషన్‌కార్డు దారులు ఉన్నారని ఉప్పు, పప్పు కొంటూ ప్రభుత్వానికి జీఎస్టీ కడుతున్నారని, మరి అలాంటి వారి కోసం ప్రభుత్వం ఏమీ చేయవద్దా అని ఎదురు ప్రశ్నించారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయమంతా ఉద్యోగుల జీతాలకు, తెచ్చిన అప్పులపై వడ్డీ కట్టేందుకే సరిపోతే మరి వారి సంక్షేమానికి ఏం చేయాలని ప్రశ్నించారు. దీనికి ఉద్యోగులు బదులిస్తూ పెద్ద మనసు చేసుకుని హెచ్ఆర్ఏ పెంచాలని కోరగా.. ఇది మనసుకు సంబంధించిన అంశం కాదని, గల్లా పెట్టెకు సంబంధించినదని మంత్రి బదులిచ్చారు.
Andhra Pradesh
Perni Nani
Employees

More Telugu News