Narendra Modi: దేశమంతా తిరిగి పుణ్యక్షేత్రాలను దర్శించిన అనుభూతి ఇక్కడికొచ్చాక కలిగింది: ప్రధాని మోదీ

Modi speech at Srirama Nagaram
  • ముచ్చింతల్ ఆశ్రమంలో ప్రధాని మోదీ 
  • సమతా మూర్తి విగ్రహావిష్కరణ
  • మోదీతో విష్వక్సేనేష్ఠి యాగం చేయించిన చిన్నజీయర్
  • యాగఫలం 130 కోట్ల మందికి అందాలని మోదీ ఆకాంక్ష
ముచ్చింతల్ ఆశ్రమంలోని శ్రీరామనగరంలో సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల భారీ విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. చిన్నజీయర్ స్వామి తనతో విష్వక్సేనేష్ఠి యాగం చేయించారని మోదీ వెల్లడించారు. ఈ యజ్ఞ ఫలం 130 కోట్ల మంది ప్రజలకు అందాలని కోరుకుంటున్నానని తెలిపారు.

ఇక్కడి శ్రీరామనగరంలో 108 దివ్యక్షేత్రాలను సందర్శించానని, దేశమంతా తిరిగి పుణ్యక్షేత్రాలను సందర్శించిన అనుభూతి కలిగిందని భక్తిపారవశ్యంతో చెప్పారు.

రామానుజాచార్యుల వారి విగ్రహం జ్ఞానం, ధ్యానానికి ప్రతీక అని పేర్కొన్నారు. రామానుజాచార్యుల బోధనలు ప్రపంచానికి దిక్సూచి అని పేర్కొన్నారు. ఆయన 11వ శతాబ్దంలోనే మానవ కల్యాణం గురించి ఆలోచించారని కీర్తించారు. రామానుజాచార్యులు అప్పటి సమాజంలోని అంధవిశ్వాసాలను పారదోలారని కొనియాడారు. ఆయన జగద్గురు అని, ఆయన బోధనలు సదా ఆచరణీయం అని పేర్కొన్నారు.

మనదేశంలో ద్వైతం, అద్వైతం కలిసి ఉన్నాయని, రామానుజాచార్యుల వారు ప్రవచించిన విశిష్టాద్వైతం మనందరికీ ప్రేరణ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. రామానుజాచార్యుల వారి బోధనల్లో వైరుధ్యం ఎప్పుడూ రాలేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలుగు భాష ఔన్నత్యం గురించి మాట్లాడుతూ, తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తావన తీసుకువచ్చారు. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్త ఖ్యాతి పొందిందని అన్నారు. వెండితెరపై తెలుగు సినిమా అద్భుతాలు సృష్టిస్తోందని పేర్కొన్నారు. తెలుగు భాష, తెలుగు చరిత్ర ఎంతో సంపన్ననమైవని వివరించారు.
Narendra Modi
Srirama Nagaram
Samatha Murthi
Ramanujacharyulu
Chinna Jeeyar Swamy

More Telugu News