Supreme Court: మీ లెక్కలు నిజం కావు.. కరోనా పరిహారాన్ని తిరస్కరించొద్దు.. పది రోజుల సమయం ఇస్తున్నాం: రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం

Official Covid toll stats not true so donot deny ex gratia
  • కరోనా మృతులకు రూ.50 వేల చొప్పున పరిహారం 
  • పరిహారం చెల్లించడం మీ బాధ్యత
  • మీరేమీ దానం చేయడం లేదు
  • సాంకేతిక కారణాలతో తప్పించుకోవద్దన్న సుప్రీం 
కరోనా మృతుల కుటుంబాలకు జాతీయ విపత్తు చట్టం కింద రూ.50 వేల చొప్పున పరిహారం చెల్లించే విషయంలో మరోసారి సుప్రీంకోర్టు చొరవ చూపించింది. రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా మరణాల విషయంలో అధికారిక గణాంకాలు నిజం కావని తేల్చేసింది. కరోనా పరిహారం కోరుతూ వచ్చే దరఖాస్తులను సాంకేతిక కారణాలు చూపిస్తూ తిరస్కరించడం కుదరదని.. పరిహారం చెల్లింపునకు 10 రోజుల వ్యవధినిస్తున్నామని పేర్కొంది.

‘‘మృతులకు సంబంధించిన అధికారిక గణాంకాలు నిజం కావు. మోసపూరిత క్లెయిమ్ లు వచ్చాయని చెప్పడం కుదరదు’’అని జస్టిస్ ఎం ఆర్ షా, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం పేర్కొంది. కరోనాతో మరణించిన ప్రతి వ్యక్తికి రూ.50 వేల చొప్పున వారి కుటుంబ సభ్యులకు చెల్లించే కార్యక్రమం దేశవ్యాప్తంగా నడుస్తుండడం తెలిసిందే. పరిహారం చెల్లింపుల్లో కొన్ని రాష్ట్రాల తీరు పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రజలకు సాయం చేయడం ప్రభుత్వ బాధ్యతగా గుర్తు చేసింది. ‘మీరు ఏమీ దానం చేయడం లేదు’ అని వ్యాఖ్యానించింది.

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన రోజు నుంచి 30 రోజుల్లోపు మరణించిన కేసులకు పరిహారం చెల్లించాలని లోగడ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆత్మహత్య చేసుకున్నా పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కోర్టు విచారిస్తోంది. మరోపక్క, మహారాష్ట్ర అత్యధికంగా 60 వేల దరఖాస్తులను తిరస్కరించింది.
Supreme Court
ex gratia
Covid toll
compensation

More Telugu News