hair loss: జుట్టు ఎక్కువగా రాలిపోతోందా..? కారణాలను గుర్తిస్తే పరిష్కారం ఉంది!
- పోషకాహారం సమస్య కావచ్చు
- ఒత్తిడి, ఇతర సమస్యల ప్రభావం
- కొన్ని రకాల ఉత్పత్తులు, ఔషధాలతోనూ సమస్య
- వైద్యుల సాయంతో సమస్య గుర్తింపు
నేటి కాలంలో ‘జుట్టు రాలిపోవడం’ ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యగా చెప్పుకోవాలి. దువ్వినప్పుడు శిరోజాలు రాలిపోవడం సాధారణమే. ఏది సాధారణం, ఏది అసాధారణం? అన్నది ఎవరికి వారు తెలుసుకోవచ్చు.
సాధారణంగా ఒక రోజులో 50-100 వరకు వెంట్రుకలు రాలిపోవడాన్ని సాధారణమని వైద్యులు చెబుతారు. అంతకుమించి కోల్పోతుంటే సమస్య ఉన్నట్టుగానే పరిగణించాలి. వెంట్రుకలు కోల్పోవడం అంటే కురుల వృద్ధి ఆగిపోయినట్టు. ఇది తీవ్రమైన సమస్యే. కానీ జుట్టు రాలడం అన్నది తాత్కాలికమేనని అమెరికా అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అంటోంది.
బరువును కోల్పోవడం, పిల్లలు పుట్టడం, అధిక జ్వరం, శస్త్రచికిత్స, ఒత్తిడి, పోషకాలలేమి ఇలా కారణాలు చాలానే ఉంటాయి. అంతేకాదు, వారసత్వ సమస్యగానూ ఇది కనిపిస్తుంది. రసాయనాలతో కూడిన షాంపూలు, కొన్ని రకాల ఔషధాలు, కాలుష్య ప్రభావంతో జుట్టు రాలొచ్చు.
కెరాటిన్ అనే ప్రొటీన్ తో వెంట్రుకలు తయారవుతాయి. వెంట్రుకలు సగటున ఒక నెలలో అర అంగుళం మేర పెరుగుతాయి. దువ్వినప్పుడు అసాధారణ స్థాయిలో వెంట్రుకలు రాలిపోవడం, ఇంటి నిండా ఎక్కడ చూసినా రాలిన జుట్టు దర్శనమిస్తుండడం, పిల్లో పైన రాలి కనిపిస్తుంటే తీవ్రమైన సమస్యగా గుర్తించాలి. వైద్యులను సంప్రదించి కారణాలను గుర్తించి చికిత్స తీసుకుంటే తప్ప పరిష్కారం లభించదు.
టెలోజెన్ ఎల్లూవియమ్ అనే సమస్యలోనూ జుట్టురాలిపోతుంటుంది. కాకపోతే ఇది మూడు నుంచి ఆరు నెలల పాటే ఉంటుంది. ఆ తర్వాత తిరిగి శిరోజాల వృద్ధి సాధారణంగానే ఉంటుంది. సరైన పోషకాహారం తీసుకోవడం ద్వారా జుట్టు రాలే సమస్యను చాలా వరకు నియంత్రించుకోవచ్చన్నది వైద్యుల సూచన.