Madhya Pradesh: 39 సంవత్సరాలపాటు కూడబెట్టిన డబ్బును పేదల చదువుకు ఇచ్చేసిన ఉపాధ్యాయుడు!

Madhyapradesh Teacher donates Rs 40 lakhs to poor students
  • రూ. 40 లక్షలను పేదల చదువుకు ఇచ్చేసిన ఉపాధ్యాయుడు
  • భర్త నిర్ణయానికి భార్య, పిల్లల మద్దతు
  • తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని గుర్తు చేసుకున్న ‘గురువు’
  • పేద విద్యార్థులకు ఆ కష్టం వద్దనే ఈ నిర్ణయమన్న విజయ్ కుమార్
కొందరికి సమాజంపై విపరీతమైన ప్రేమ ఉంటుంది. దాని కోసం తమ జీవితాన్ని ధారపోస్తారు. ఇంకొందరు తమ ఆస్తిపాస్తులను సమాజం కోసం వెచ్చిస్తారు. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే ఉపాధ్యాయుడు మాత్రం వీరికి కొంచెం భిన్నం. 39 సంవత్సరాలపాటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన ఆయన ఆ కాలంలో సంపాదించిన తన కష్టార్జితం మొత్తం రూ. 40 లక్షలను పేద పిల్లల చదువు కోసం విరాళంగా ఇచ్చేసి తన పెద్ద మనసును చాటుకున్నారు.

ఉపాధ్యాయుడిగా వేలాదిమందిని తీర్చిదిద్దినప్పటికీ అది ఆయనకు సంతృప్తినివ్వలేదు. వారి కోసం ఇంకేదో చేయాలన్న ఉద్దేశంతో ఉద్యోగిగా తాను సంపాదించిన రూ. 40 లక్షలను పేద విద్యార్థుల చదువుకు ఇచ్చేశారు. ఆ ఉపాధ్యాయుడి పేరు విజయ్ కుమార్ చాన్సోరియా. మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలోని ఖాందియాకు చెందిన ఆయన ఉద్యోగ విరమణ సందర్భంగా తీసుకున్న నిర్ణయమిది.

అంతమాత్రాన ఆయనకు భార్యాపిల్లలు లేరనుకోవడం పొరపాటు. వారి అనుమతితోనే తాను ఇన్నాళ్లుగా దాచుకున్న పీఎఫ్, గ్రాట్యుటీ నిధులను పేద విద్యార్థులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని బాధలన్నింటినీ మనం తగ్గించలేమని, కానీ మనం చేయాల్సిన కాసింత మంచినైనా చేద్దామని అన్నారు. తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి చదువుకున్నానని, చదువంటే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు ఆ కష్టం రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
Madhya Pradesh
Teacher
Poor Students

More Telugu News