Kishan Reddy: ప్రధాని గురించి కేసీఆర్ మాటలు జుగుప్సాకరం.. పథకం ప్రకారం విషం చిమ్ముతున్నారు: కిషన్ రెడ్డి ధ్వజం

KCR comments on PM Modi are objectionable says Kishan Reddy
  • సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలి
  • హుజూరాబాద్ లో ఓటమి తర్వాత కేసీఆర్ లో అభద్రతాభావం నెలకొంది
  • రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్నారు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుందాగా వ్యవహరించాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన మంత్రి గురించి మాట్లాడేటప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి హుందాగా ఉండాలని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై, బీజేపీపై గత కొన్ని రోజులుగా కేసీఆర్ దిగజారిన భాషను ఉపయోగిస్తున్నారని, అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

 హుజూరాబాద్ లో ఘోర ఓటమి చెందినప్పటి నుంచి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు పక్కా వ్యూహం ప్రకారం బీజేపీపై విషాన్ని చిమ్మే కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. ప్రతిరోజు వరుసల వారీగా సీఎం, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారని దుయ్యబట్టారు.

కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. రాజ్యాంగం గురించి నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు దారుణమని అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూ రాజ్యాంగాన్ని మార్చాలని మాట్లాడటం దురదృష్టకరమని చెప్పారు. ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తిని అవమానించేలా మాట్లాడటం జుగుప్సను కలిగించేలా ఉందని అన్నారు.

ఏ రాజ్యాంగం ఆధారంగా తెలంగాణలో పార్టీ పెట్టి, అధికారంలోకి వచ్చారో... అదే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించేలా కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలను రాజకీయాలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

 ముందు నుంచి కూడా కేసీఆర్ చెప్పేదొకటి, చేసేదొకటని అన్నారు. కొంత మందిని ఆకట్టుకునేలా మాట్లాడినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవని చెప్పారు. హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గెలిచిన తర్వాత కేసీఆర్ లో అభద్రతా భావం కనిపిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.

మరోవైపు కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా దీక్షలకు బీజేపీ పిలుపునిచ్చింది. బీజేపీ భీమ్ పేరుతో దీక్షలను చేపట్టనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని మండల కేంద్రాల్లో దీక్షలను చేపట్టబోతున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ లక్ష్మణ్, రాజాసింగ్ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్షలో కూర్చోనున్నారు.
Kishan Reddy
Narendra Modi
BJP
KCR
TRS

More Telugu News