Rafael Nadal: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మహాయుద్ధం... రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన నాదల్

Rafael Nadal won Australian Open Mens Singles Title
  • ఫైనల్లో మెద్వెదెవ్ పై ఘనవిజయం
  • ఐదు సెట్ల హోరాహోరీ
  • తొలి రెండు సెట్లు ఓడిన నాదల్
  • ఆపై అద్భుత రీతిలో వరుసగా మూడు సెట్లు కైవసం
ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పురుషుల సింగిల్స్ టైటిల్ ను స్పెయిన్ దిగ్గజం, రెండో సీడ్ రాఫెల్ నాదల్ చేజిక్కించుకున్నాడు. మెల్బోర్న్ లోని రాడ్ లేవర్ ఎరీనాలో జరిగిన ఫైనల్లో నాదల్ 2-6, 6-7, 6-4, 6-4,7-5తో రష్యా ఆటగాడు డానిల్ మెద్వెదేవ్ పై అద్భుత విజయం సాధించాడు.

ఈ పోరు నిజంగా యుద్ధాన్ని తలపించేలా సాగింది. తొలి రెండు సెట్లు కోల్పోయిన నాదల్ ఓటమి ఖాయమే అని అందరూ భావించినా, ఒక్కసారిగా రెచ్చిపోయిన ఈ స్పెయిన్ బుల్ వరుసగా మూడు సెట్లు చేజిక్కించుకుని ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా అవతరించాడు.

ఆటగాళ్లపై ఆస్ట్రేలియా వాతావరణం బాగా ప్రభావం చూపింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో వేసవి కావడంతో ఉక్కపోతను తట్టుకోవడం నాదల్, మెద్వెదెవ్ లకు పరీక్షలా మారింది. మెద్వెదెవ్ త్వరగా అలసిపోవడంతో ఆ ప్రభావం ఆటపై పడింది. చివరికి నాదల్ పైచేయి సాధించి టైటిల్ ను ఎగరేసుకెళ్లాడు.

ఈ మ్యాచ్ కు హాజరైన ప్రేక్షకుల్లో అత్యధికులు నాదల్ కే మద్దతు పలకడం లైవ్ లో కనిపించింది. ప్రతికూల పరిస్థితుల్లో బక్కపలుచని మెద్వెదెవ్ ఎంత పోరాడినా ఫలితం దక్కలేదు.

కాగా, ఈ విజయంతో నాదల్ వరల్డ్ రికార్డు సాధించాడు. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో అత్యధికంగా 21 గ్రాండ్ స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించాడు. నాదల్ సమకాలికులు రోజర్ ఫెదరర్, నొవాక్ జకోవిచ్ చెరో 20 టైటిళ్లు సాధించారు. ఇప్పుడు వారిద్దరినీ వెనక్కి నెట్టిన నాదల్ ఆల్ టైమ్ గ్రేట్ గా నిలిచాడు. నాదల్ ప్రొఫెషనల్ కెరీర్ లో ఇది రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్. 2009లో తొలిసారి ఇక్కడ టైటిల్ నెగ్గిన నాదల్ మళ్లీ 13 ఏళ్ల తర్వాత మరోసారి విజేతగా నిలిచాడు.
Rafael Nadal
Singles Title
Australian Open
Daniil Medvedev
Spain
Russia

More Telugu News