Rajunaik: రూ. 10 కోట్ల విలువైన భూమి విషయంలో తగాదా.. టీఆర్ఎస్ నాయకుడి దారుణహత్య

TRS leader killed over land Issue
  • టీఆర్ఎస్ ఎస్టీసెల్ తెల్లాపూర్ మునిసిపల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజునాయక్
  • ఈ నెల 24న అదృశ్యం
  • హత్యచేసి తల, మొండాన్ని వేర్వేరుగా పడేసిన వైనం
  • పోలీసుల అదుపులో ఐదుగురు
పది కోట్ల రూపాయల విలువైన భూమి విషయంలో మొదలైన గొడవ టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్యకు దారితీసింది. సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..  వెలిమల తండాలో నివసిస్తున్న టీఆర్ఎస్ ఎస్టీ సెల్ తెల్లాపూర్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు కడావత్ రాజునాయక్ (32) ఈ నెల 24న అదృశ్యమయ్యారు. దీనిపై ఆ తర్వాతి రోజు బీడీఎల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారిచ్చిన సమాచారం మేరకు  నిన్న సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం కుసునూరు వాగు వద్ద రాజునాయక్ తల, మనూర్ మండలంలోని పుల్కుర్తి బ్రిడ్జిపై సింగూరు బ్యాక్ వాటర్‌లో మొండాన్ని స్వాధీనం చేసుకున్నారు.  

వెలిమెల తండాలోని రూ. 10 కోట్ల విలువైన 33 గుంటల భూమి విషయంలో నెలకొన్న తగాదాలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యలో మొత్తం 8 మందిని నిందితులుగా గుర్తించిన పోలీసులు ఇప్పటి వరకు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.
Rajunaik
TRS
Sangareddy District
Murder

More Telugu News