Hyderabad: మనీలాండరింగ్ కేసు.. ‘కార్వీ’ చైర్మన్ పార్థసారథికి నాలుగు రోజుల కస్టడీ
- రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని పార్థసారథి
- ఇన్వెస్టర్ల షేర్లు తన ఖాతాలకు బదలాయింపు
- వాటిని తనఖా పెట్టి బ్యాంకుల్లో రుణాలు
- రూ. 1500 కోట్ల మేర మోసం జరిగినట్టు గుర్తింపు
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్ అయిన కార్వీ సంస్థ చైర్మన్ పార్థసారథిని నాలుగు రోజుల కస్టడీకి ఈడీ ప్రత్యేక న్యాయస్థానం అనుమతినిచ్చింది. కార్వీ సంస్థ తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు గతంలో హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దాంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరిట కార్వీ సంస్థ భారీ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. ఈ సందర్భంగా మనీలాండరింగ్ జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగంలోకి దిగారు.
ఈడీ జరిపిన విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్వెస్టర్ల షేర్లను కూడా పార్థసారథి తన సొంత ఖాతాలకు మళ్లించుకుని, వాటిని తనఖా పెట్టి బ్యాంకు రుణాలు తీసుకున్నట్టు గుర్తించారు. మొత్తంగా రూ. 1500 కోట్ల మేర మోసం జరిగినట్టు ప్రాథమికంగా తేల్చారు.
ఈ నేపథ్యంలో మొన్న బెంగళూరులో పార్థసారథిని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అనంతరం ఆయనను ఈడీ ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టగా రేపటి నుంచి ఈ నెల 30 వరకు ఈడీ కస్టడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.