New Parliament Bhavan: భారీగా పెరిగిన కొత్త పార్లమెంటు భవనం నిర్మాణ ఖర్చు.. డెడ్ లైన్ పొడిగింపు!

Indias new Parliament building construction cost increased
  • 2020 డిసెంబర్ లో కొత్త పార్లమెంటు భవనానికి భూమిపూజ
  • రూ. 1,249 కోట్లకు చేరుకున్న తాజా బడ్జెట్
  • ఇప్పటి వరకు 40 శాతం పూర్తయిన పనులు
సెంట్రల్ విస్టా పేరుతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంటు భవన సముదాయాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 2020 డిసెంబర్ లో ఈ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ సమయంలో ఈ ప్రాజెక్టు బడ్జెట్ రూ. 977 కోట్లుగా ఉంది. అయితే ఏడాది గడిచే లోగానే బడ్జెట్ భారీగా పెరిగింది. ఏకంగా 29 శాతం పెరుగుదలతో రూ. 282 కోట్ల మేర పెరిగి... ప్రస్తుతం రూ. 1,249 కోట్లకు చేరుకుంది.

కొత్త పార్లమెంటు నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ సంస్థ చేపట్టింది. రాష్ట్రపతి భవన్ కు కూతవేటు దూరంలో 13 ఎకరాల స్థలంలో పార్లమెంటు భవనాలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మన దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సమయానికల్లా నిర్మాణాన్ని పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. ప్రస్తుతం డెడ్ లైన్ ను అక్టోబర్ కు పొడిగించారు.

కరోనా నిబంధనలు కూడా అడ్డురాని విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇది జాతీయ ప్రాధాన్యత ప్రాజెక్టు అయినందువల్ల పనులకు ఆటంకం కలగకుండా చూడాల్సి ఉందని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పార్లమెంటు నిర్మాణ పనులకు కోవిడ్ ఆంక్షలు వర్తించవని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు మనం ఇప్పుడు ఉపయోగిస్తున్న పార్లమెంటు భవనం బ్రిటీష్ వారి కాలంలో నిర్మించినది. ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత భవనం లేకపోవడం, ఎంపీలకు సరైన విధంగా కార్యాలయాలు లేకపోవడం తదితర కారణాలతో కొత్త భవనానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.

కొత్త పార్లమెంటును లోక్ సభ ఛాంబర్ లో 888 మంది ఎంపీలు కూర్చునేలా నిర్మిస్తున్నారు. అంతేకాదు జాయింట్ సెషన్ (లోక్ సభ, రాజ్యసభ)లో 1,224 మంది సభ్యులు కూర్చునేలా అత్యంత విశాలంగా నిర్మిస్తున్నారు. రాజ్యసభలో 384 మంది కూర్చునేలా... అవసరమైతే సీటింగ్ పెంచుకునేలా నిర్మాణం చేపట్టారు. ప్రతి పార్లమెంటు సభ్యుడికి 40 చదరపు మీటర్ల కార్యాలయం ఉండేలా పార్లమెంటు ప్రాంగణంలోనే శ్రమ శక్తి భవన్ ను నిర్మిస్తున్నారు. ఈ భవన్ 2024కి పూర్తవుతుంది.
New Parliament Bhavan
Central Vista
Budget
Opening

More Telugu News