Telangana: చనిపోయిన చెల్లెలు.. ఎవరికి చెప్పాలో తెలియక నాలుగు రోజులపాటు మృతదేహంతోనే గడిపిన అక్క!

sister lives with younger sister dead body for 4 days in telangana
  • తెలంగాణలోని పెద్దపల్లిలో ఘటన
  • అనారోగ్యంతో చెల్లెలు మృతి
  • నా అన్నవారు ఎవరూ లేకపోవడంతో మృతదేహంతోనే గడిపిన సోదరి
  • ఇంటి నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు స్థానికుల ఫిర్యాదు
కొన్ని ఘటనలు తీరని విషాదాన్ని నింపుతాయి. గుండెలు పిండేస్తాయి. విన్నవారి కళ్లలో సైతం నీళ్లు తెప్పిస్తాయి. అలాంటి ఘటనే ఒకటి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో జరిగింది. నా అన్నవారు ఎవరూ లేక ఒకరికి ఒకరు తోడుగా నివసిస్తున్న అక్కాచెల్లెళ్లను విధి విడదీసింది. కళ్లముందే చెల్లెలు చనిపోయి పడి వున్నా ఎవరికి చెప్పాలో తెలియని ఆ సోదరి నాలుగు రోజులుగా ఆమె మృతదేహంతోనే గడిపింది. చివరికి చుట్టుపక్కల వారు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పెద్దపల్లిలోని ప్రగతినగర్‌కు చెందిన మారోజు శ్వేత (24), ఆమె అక్క స్వాతి సొంత ఇంట్లో నివసిస్తున్నారు. వారి తల్లిదండ్రులు గతంలోనే మరణించడం, నా అన్నవారు ఎవరూ లేకపోవడంతో వీరిద్దరే ఉంటున్నారు. శ్వేత ఎంబీఏ చదువుకోగా, స్వాతి ఎంటెక్ పూర్తి చేసి పట్టణంలోనే ఓ ప్రైవేటు కళాశాలలో పనిచేస్తున్నారు. అస్వస్థత కారణంగా నాలుగు రోజుల క్రితం శ్వేత మృతి చెందింది. అయితే, బంధువులు, రక్త సంబంధీకులు ఎవరూ లేకపోవడంతో ఎవరికి చెప్పాలో పాలుపోని స్థితిలోకి వెళ్లిపోయిన స్వాతి సోదరి మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకుని గడుపుతోంది.

నాలుగు రోజుల తర్వాత వారింటి నుంచి దుర్వాసన రావడంతో అనుమానించిన ఇరుగుపొరుగు నిన్న సాయంత్రం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కుళ్లిన స్థితిలో ఉన్న శ్వేత మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించారు. తన చెల్లెలు అనారోగ్యంతో మృతి చెందినట్టు ఈ సందర్భంగా స్వాతి పోలీసులకు తెలిపారు.

 కాగా, వీరి మానసిక పరిస్థితిపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వారి నానమ్మ, అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా రెండుమూడు రోజులపాటు ఎవరికీ చెప్పలేదని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Telangana
Peddapalli
Sister
Death

More Telugu News