భార్య అయినా సరే.. ఇష్టంలేని శృంగారాన్ని తిరస్కరించొచ్చు: ఢిల్లీ హైకోర్టు
- సంబంధాన్ని బట్టి నేరం మారిపోదు
- 50 దేశాల్లో వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించారు
- బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే అది నేరమే అవుతుంది
ఢిల్లీ ప్రభుత్వం తరపు న్యాయవాది నందితా రావ్ తన వాదనలు వినిపిస్తూ భర్తకు ప్రస్తుతం ఉన్న మినహాయింపులను రద్దు చేయాల్సిన అవసరం లేదన్నారు. వీటి వల్ల భార్యల గౌరవానికి భంగం కలిగిస్తున్నట్టు నిరూపించగలరా? అని ప్రశ్నించారు. దీంతో కలుగజేసుకున్న జస్టిస్ శక్దేర్.. మహిళ నెలసరిలో ఉన్నప్పుడు శృంగారానికి నిరాకరిస్తే, అప్పుడు అతడు బలవంతంగా లైంగిక చర్యకు పాల్పడితే అది నేరం కాదా? అని ప్రశ్నించారు.
స్పందించిన నందిత రావ్.. అది నేరమే కానీ అత్యాచార పరిధిలోకి రాదని సమాధానమిచ్చారు. మరోమారు కల్పించుకున్న న్యాయమూర్తి.. ఇప్పుడు ఇదే ప్రశ్నార్థకమవుతోందని, సహజీవనం చేసే వారి విషయంలో ఈ చర్య ఐపీసీ-375 పరిధిలోకి వస్తే, వివాహిత విషయంలో ఎందుకు రాదని ప్రశ్నించారు. సంబంధాన్ని బట్టి అలా చెప్పడం సరికాదని న్యాయమూర్తి అన్నారు.