Krishna District: మున్నేరులో గల్లంతైన ఐదుగురు చిన్నారులూ మృతి.. ఏటూరులో విషాదం
- మున్నేరులో స్నానానికి దిగిన ఐదుగురు చిన్నారులు
- ఐదుగురి మృతదేహాలో లభ్యం
- కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న తల్లిదండ్రులు
కృష్ణా జిల్లా చందర్లపాడు మండలం ఏటూరు వద్ద మున్నేరులో గల్లంతైన చిన్నారులు ఐదుగురూ మృతి చెందారు. వారి మృతదేహాలను వెలికితీశారు. తిరిగి వస్తారనుకున్న కుమారులు ఇలా విగతజీవులు కావడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలిసి ఏటూరులో విషాద ఛాయలు అలముకున్నాయి.
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ఇంటి వద్ద ఉంటున్న పిల్లల్లో ఐదుగురు.. మాగులూరి సన్నీ (12), కర్ల బాలయేసు (12), జెట్టి అజయ్ (12), మైలా రాకేశ్ (11), గురజాల చరణ్ (14) మున్నేరులో స్నానాల కోసం సైకిళ్లపై వెళ్లారు. వీరిలో సన్నీ, బాలయేసు, అజయ ఏడో తరగతి చదువుతుండగా, రాకేశ్ ఆరో తరగతి, చరణ్ తొమ్మిదో తరగతి చదువుతున్నారు.
పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు సాయంత్రం తిరిగి వచ్చేసరికి పిల్లలు కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ఆ వెంటనే గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మున్నేరు వద్ద వారి దుస్తులు, సైకిళ్లు కనిపించడంతో స్నానాల కోసం అందులో దిగి ఉంటారని భావించి గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన ఐదుగురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలముకున్నాయి.