Naga Ramakrishna: సెల్ఫీ వీడియోలు ఎక్కడ దాచిందీ చెబుతూ మిత్రుడికి నాగ రామకృష్ణ మెసేజ్.. రిమాండ్ రిపోర్టులో వెల్లడి

The police submitted the Raghava remand report to the court
  • కోర్టుకు ఏడు పేజీల రిమాండ్ రిపోర్టు సమర్పణ 
  • రాఘవకు బెయిలు లభిస్తే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తాడన్న పోలీసులు
  • రామకృష్ణ తల్లి, సోదరి అరెస్ట్
పాల్వంచలో కుటుంబం సామూహిక ఆత్మహత్య కేసులో ఇటీవల వరుసగా బయటకు వస్తున్న సెల్ఫీ వీడియోల గురించి మరో విషయం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అన్ని వివరాలను సెల్ఫీ వీడియోల్లో రికార్డు చేసిన రామకృష్ణ.. అవి అందరికీ తెలిసేందుకు గాను ఓ మిత్రుడి సాయం తీసుకున్న విషయం పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.

రామకృష్ణ ఆత్మహత్యకు ముందు తన మిత్రుడికి ఓ మెసేజ్ చేస్తూ.. తనను క్షమించాలని, తాను ఓ వీడియో చేసి కారు డ్యాష్ బోర్డులో పెట్టానని తెలిపారు. తన కార్యక్రమాలన్నీ అయిపోయాక 7474 నంబరుతో ఫోన్ అన్‌లాక్ చేసి వీడియో చూసి ఆ తర్వాత అందరికీ పంపాలని, కారు తాళం చెవి బాత్రూంపై పెట్టానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని నీకు మాత్రమే చెబుతున్నానని రామకృష్ణ పేర్కొన్నారు.

ఈ మెసేజ్ ఆధారంగానే ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినట్టు కోర్టుకు సమర్పించిన ఏడు పేజీల రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. రామకృష్ణ కారులో ఆత్మహత్య లేఖతోపాటు ఏడు పేజీల అప్పుల కాగితాలు కూడా స్వాధీనం చేసుకున్నామని, వీటితోపాటు 34 నిమిషాల నిడివి ఉన్న సెల్ఫీ వీడియో ఉన్న ఫోన్‌ను సీజ్ చేశామని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

రాఘవకు కనుక బెయిలు లభిస్తే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తాడని, సాక్షుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. కాగా, రిమాండ్ రిపోర్టుతోపాటు రాఘవపై గతంలో అధికారికంగా నమోదైన 11 కేసుల వివరాలను కూడా కోర్టుకు సమర్పించారు.

మరోపక్క, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య తర్వాత పరారీలో ఉన్న అతడి తల్లి సూర్యవతి, సోదరి కొమ్మిశెట్టి లీలా మాధవిలను పాల్వంచ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అనంతరం కొత్తగూడెం అదనపు జుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి కోర్టులో పెట్టారు. న్యాయమూర్తి వారికి ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో ఖమ్మం జిల్లా జైలుకు తరలించారు.
Naga Ramakrishna
Bhadradri Kothagudem District
Vanama Raghava
Remand Report

More Telugu News