Payyavula Keshav: ప్రజాసమస్యలు గాలికొదిలేసి సినీ పరిశ్రమ చుట్టూ తిరగడం సరికాదు: వైసీపీ సర్కారుపై పయ్యావుల కేశవ్ విమర్శలు

Payyavula Keshav slams AP Govt
  • రగులుతున్న సినిమా టికెట్ల ధరల అంశం
  • సినిమాలతో ప్రభుత్వం ఆనందం పొందుతోందన్న కేశవ్
  • మీరు ఏ సమస్యను పరిష్కరించారంటూ నిలదీత
గత కొంతకాలంగా ఏపీ సర్కారుకు, టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు మధ్య సినిమా టికెట్ల ధరల అంశం రగులుతోంది. ఇవాళ ఇదే అంశంపై ఏపీ మంత్రి పేర్ని నాని, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి సినీ పరిశ్రమ చుట్టూ తిరగడం సరికాదని వైసీపీ ప్రభుత్వానికి హితవు పలికారు.

ఇవాళ పీఏసీ సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం పయ్యావుల మాట్లాడుతూ, విద్యుత్ అంశాలపై సమాచారం ఇవ్వకుండా కొవిడ్ పేరుతో సమావేశానికి దూరం కావడంపై విమర్శలు చేశారు.

"ఏ సమస్యను మీరు పరిష్కరించారు? ఏ నిత్యావసర వస్తువుల ధరలను మీరు తగ్గించారు? డబ్బున్న వాళ్లో, సరదాపడిన వాళ్లో సినిమాకు పోవాలనుకుంటే దాంతో మీరు ఆనందం పొందాలనుకుంటున్నట్టుంది. తిట్టడానికే తప్ప మాట్లాడ్డానికి మంత్రులు కరవయ్యారు. ఈ రాష్ట్రంలో సినిమాలను మించిన అజెండా చాలా ఉంది. ప్రజల వినోదం కోసం ఉండాల్సిన సినిమా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి, క్యాబినెట్ కు వినోదంగా మారింది" అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Payyavula Keshav
AP Govt
Cinema Tickets
Tollywood

More Telugu News