Darvaza Crater: 'నరకానికి ముఖద్వారం' మూసివేయాలని తుర్క్ మెనిస్థాన్ నిర్ణయం 

Turkmenistan president orders to closure of Gateway of Hell Darvaza Crater
  • కారకుమ్ ఎడారిలో నిత్యాగ్ని కీలలు
  • భూమిలోని సహజవాయువే ఇంధనం
  • దశాబ్దాలుగా ఆరిపోని వైనం
  • 'ఎడారి జ్యోతి'గా నామకరణం చేసిన ప్రభుత్వం

ఈ భూమండలంపై మానవాళికి అంతుబట్టని విషయాలెన్నో ఉన్నాయి. అలాంటివాటిలో తుర్క్ మెనిస్థాన్ లోని ఓ మృత్యు బిలం కూడా ఉంది. దీన్ని 'నరకానికి ద్వారం' అని పిలుస్తారు. తుర్క్ మెనిస్థాన్ లోని కారకుమ్ ఎడారిలో 'దర్వాజా' అనే పేరున్న అగ్ని బిలం ఉంది. ఇది ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఇందులో ఉత్పన్నమయ్యే వాయువులు అక్కడి అగ్నికీలలకు ప్రధాన ఇంధనం.

అయితే, ఈ మృత్యు ముఖాన్ని మూసివేయాలని తుర్క్ మెనిస్థాన్ అధ్యక్షుడు గుర్బంగూలీ బెర్డీముఖమెదోవ్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ, ఆరోగ్య కారణాల రీత్యా, సహజవాయువు నిల్వల పరిరక్షణ, ఎగుమతుల పరిమాణాన్ని పెంచే ఉద్దేశంతోనూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

అసలు ఈ బిలం ఎప్పుడు, ఎలా ఏర్పడిందో ఇంతవరకు సరిగా నిర్ధారణ కాలేదు. సోవియట్ హయాంలో 1971లో ఇక్కడ చమురు నిక్షేపాల కోసం తవ్వకాలు సాగిస్తుండగా ఏర్పడి ఉంటుందని చాలామంది నమ్ముతారు. కెనడాకు చెందిన జార్జ్ కరోనియస్ 2013లో ఈ బిలం లోతును పరిశీలించే ప్రయత్నం చేశాడు. పలు పరిశోధనల అనంతరం, ఇది మానవ చర్యల ఫలితంగా ఏర్పడింది కాదని పేర్కొన్నాడు. స్థానిక తుర్క్ మెనిస్థాన్ జియాలజిస్టుల అంచనా ప్రకారం 60వ దశకంలో ఇక్కడ భారీ బిలం ఏర్పడిందని, అయితే అది 80వ దశకం నుంచి మండుతోందని చెబుతుంటారు.

ఏదేమైనా ఈ బిలం తుర్క్ మెనిస్థాన్ లో ప్రముఖ పర్యాటక స్థలంగా విలసిల్లుతోంది. తాజాగా, దేశాధ్యక్షుడు బెర్డీముఖమెదోవ్ స్పందిస్తూ, ఈ బిలం కారణంగా ఎంతో విలువైన సహజవనరులను కోల్పోతున్నామని అన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుంటే గణనీయమైన లాభాలు పొందవచ్చని, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపర్చవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నిత్యాగ్నికీలలను ఆర్పివేసేందుకు తగిన మార్గం అన్వేషించాలని ఈ సందర్భంగా అధికారులకు నిర్దేశించారు.

ఈ మృత్యు ముఖం వంటి బిలంలో రగిలే జ్వాలలను ఆర్పివేసేందుకు గతంలోనూ అనేక ప్రయత్నాలు జరిగాయి. 2010లోనూ మంటల ఆర్పివేతకు బెర్డీముఖమెదోవ్ ఆదేశాలు ఇచ్చినా ఏమాత్రం ప్రయోజనం కనిపించలేదు. ఇది ఆరిపోకపోవడంతో 2018లో దీనికి "కారకుమ్ ఎడారి జ్యోతి" అంటూ అధికారికంగా నామకరణం చేశారు. మరి ఈసారి దీన్ని ఆర్పడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News