Chandrababu: సిమెంట్ రేటు తగ్గించరు కానీ, సినిమా టికెట్ల ధరలు తగ్గిస్తారట!: చంద్రబాబు వ్యంగ్యం

Chandrababu comments on CM Jagan
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నేడు తన పర్యటన చివరిరోజున శెట్టిపల్లె సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సినిమా టికెట్ల అంశంపై స్పందించారు. 'భారతి సిమెంట్ రేట్లు తగ్గించరట కానీ, సినిమా టికెట్ల ధరలు మాత్రం తగ్గిస్తారట' అంటూ వ్యాఖ్యానించారు. ఈ ముఖ్యమంత్రి చేపల మార్కెట్ల గురించి మాట్లాడుతుంటాడు అంటూ ఎద్దేవా చేశారు.

అటు, ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటనపైనా చంద్రబాబు స్పందించారు. ఐఆర్ కంటే తక్కువ ఫిట్ మెంట్ ప్రకటించారని విమర్శించారు. పీఆర్సీపై ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారే తప్ప ఉద్యోగులు కాదని పేర్కొన్నారు. రిటైర్ అయితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందనే ఉద్యోగుల పదవీవిరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని ఆరోపించారు. పులివెందుల తరహా రాజకీయాలు ఇలాగే ఉంటాయని విమర్శించారు. గతంలో తాము 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు.

అంతకుముందు, కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక నేతలు ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తాను వచ్చినప్పుడు హడావిడి చేస్తూ, ఆ తర్వాత ప్రజలకు దూరంగా ఉంటున్నారని ఆరోపించారు. ఇకపై ప్రజల్లో ఉండే నాయకులకే తన ప్రోత్సాహం ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
Go Back to Shorts
Chandrababu
CM Jagan
Kuppam
TDP

More Telugu News