RRR: ‘ఆర్ఆర్ఆర్’కు మరో ఆటంకం... విడుదల ఆపాలంటూ హైకోర్టులో మహిళ పిల్!

PIL filed in TS High Court requesting to stay release of RRR movie
షార్ట్స్‌లో చూడండి
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'కు కష్టాలు ఎదురవుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం ఈ చిత్రం విడుదలపై తీవ్ర ప్రభావం చూపింది. థియేటర్లలో 50 శాతం ప్రేక్షకులకు మాత్రమే అనుమతి అంటూ పలు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలు ఈ సినిమా వసూళ్లను భారీగా దెబ్బతీసే అవకాశం ఉంది. దీంతోపాటు ఏపీలో టికెట్ ధరల తగ్గింపు వ్యవహారం ఈ చిత్రానికి మరో షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, రేపు (జనవరి 7) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని నిర్మాతలు వాయిదా వేసుకున్నారు.

మరోవైపు ఈ సినిమాకు తాజాగా మరో షాక్ తగిలింది. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ తెలంగాణ హైకోర్టులో పిల్ (ప్రజా ప్రయోజన వ్యాజ్యం) దాఖలయింది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరంకు చెందిన అల్లూరి సౌమ్య అనే మహిళ ఈ పిల్ వేశారు. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ లను అవమానించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని తన పిటిషన్ లో ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ వీరుల అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రాన్ని రూపొందించారని ఆరోపించారు. నిజమైన వీరుల చరిత్రను వక్రీకరించేలా సినిమాను తీశారని కోర్టుకు తెలిపారు. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని కోరారు. సినిమా విడుదలపై స్టే ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్ ను హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
Go Back to Shorts
RRR
TS High Court
PIL
Release
Alluri Sowmya

More Telugu News