కోహ్లీ ప్రెస్ మీట్లకు రాకపోవడానికి కారణం ఇదే: ద్రావిడ్
- వందో టెస్టు రోజున మీడియాతో మాట్లాడతానని చెప్పాడు
- మ్యాచ్ ఫలితాలను తాను నిర్ణయించలేనన్న ద్రావిడ్
- జనవరి 11న జరిగే మూడో టెస్టు కోహ్లీకి వందో టెస్టు
మీడియా ముందుకు కోహ్లీ రాకపోవడానికి ప్రత్యేక కారణం ఏదీ లేదని ద్రావిడ్ అన్నారు. తన వందో టెస్టు రోజున మీడియాతో మాట్లాడతానని కోహ్లీ తనకు చెప్పాడని తెలిపారు. ఆ రోజున కోహ్లీని మీరు ఎన్ని ప్రశ్నలైనా అడగొచ్చని చెప్పారు. మ్యాచ్ లను గెలవడంలో తన పాత్ర గురించి మీడియా ప్రశ్నించగా... మ్యాచ్ ఫలితాలను తాను నిర్ణయించలేనని... అయితే జట్టు సభ్యులు మెరుగ్గా రాణించేలా వారిని సన్నద్ధం చేయగలనని అన్నారు. మరోవైపు జనవరి 11న కేప్ టౌన్ లో జరిగే మూడో టెస్టు కోహ్లీకి వందో టెస్టు కాబోతోంది.
కాగా, వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తనకు చెప్పకుండానే కెప్టెన్సీ నుంచి తొలగించారని కోహ్లీ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. కోహ్లీ వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ... కోహ్లీ అలా మాట్లాడి ఉండకూడదని అన్నారు. కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నామనే విషయాన్ని కోహ్లీకి చెప్పామని సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ చేతన్ శర్మ తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో మీడియా ముందుకు కోహ్లీ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.