New Delhi: యాక్టివ్ కేసులు 3 రోజుల్లోనే 3 రెట్లు అయ్యాయి: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Active Cases Raised 3 Times In 3 Days Says Arvind Kejriwal
  • 2,291 నుంచి 6,360కి పెరుగుదల
  • రోజూ కరోనా కేసులూ పెరుగుతున్నాయి
  • భయం అక్కర్లేదు.. తీవ్రత తక్కువే
  • ప్రజలంతా బాధ్యతాయుతంగా ఉండాలి
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. కేసులు పెరుగుతున్నా భయపడాల్సిన అవసరం లేదని, ఒమిక్రాన్ తీవ్రత తక్కువేనని అన్నారు. కాగా, రోజురోజుకు కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయని, ఈ మూడు రోజుల్లోనే యాక్టివ్ కేసులు మూడింతలయ్యాయని హెచ్చరించారు.

మూడు రోజుల క్రితం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 2,291 ఉన్నాయని, ఇప్పుడవి 6,360కి పెరిగాయని పేర్కొన్నారు. డిసెంబర్ 29న కొత్తగా 923 కరోనా కేసులు నమోదైతే.. ఆ మర్నాడు డిసెంబర్ 30న 1,313 కేసులు, డిసెంబర్ 31న 1,796 కేసులు వచ్చాయని చెప్పారు. నిన్న ఒక్కరోజే కేసుల సంఖ్య 2,716కు పెరిగాయన్నారు. ఇవాళ 3,100 కేసులు వచ్చే అవకాశం ఉందన్నారు.

కేసులు పెరుగుతున్నా కరోనా బారిన పడినవారు ఆసుపత్రుల్లో చేరుతున్న ఘటనలు తక్కువేనన్నారు. నిన్న ఆసుపత్రుల్లో కేవలం 246 మంది చేరారన్నారు. 82 మంది పేషెంట్లకే ఆక్సిజన్ బెడ్లు అవసరమయ్యాయని చెప్పారు. థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. యుద్ధప్రాతిపదికన ఆసుపత్రుల్లో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 37 వేల బెడ్లు సిద్ధంగా ఉంచామన్నారు. ప్రజలు మాస్కులు విధిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, ఎల్లప్పుడూ చేతులను సబ్బుతో కడుక్కోవాలని కేజ్రీవాల్ సూచించారు.
New Delhi
COVID19
Arvind Kejriwal

More Telugu News