Rajamouli: ఈ కథ భారత గడ్డపై పుట్టిన భావోద్వేగం... చెన్నైలో 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి

Rajamouli speech at RRR Pre Release event in Chennai
  • హాజరైన రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి
  • తమిళంలో ప్రసంగించిన హీరోలు
  • జనవరి 7న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్
  • తమిళంలోనూ వస్తున్న చిత్రం
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంటును చెన్నైలో నిర్వహించారు. పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకున్న ఆర్ఆర్ఆర్ తమిళంలోనూ విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకుడు రాజమౌళి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తమిళ సినీ హీరోలు ఉదయనిధి, శివకార్తికేయన్, నిర్మాతలు థాను, ఆర్బీ చౌదరి, తమిళ లిరిక్ రైటర్ మదన్ కార్కీ తదితరులు విచ్చేశారు.

ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తమది అన్నదమ్ముల అనుబంధం అని, తాను మరణించే వరకు తమ అనుబంధం చెదిరిపోనివ్వనని స్పష్టం చేశారు. తారక్ వంటి వ్యక్తితో అనుబంధానికి ఆ దేవుడికి థ్యాంక్స్ చెబుతానని అన్నారు. తారక్ కు, తనకు మధ్య వయసు ఓ ఏడాది తేడా ఉంటుందని, రియల్ లైఫ్ లో తారక్ మనస్తత్వపరంగా చిన్నపిల్లాడిలా కనిపించినా, వ్యక్తిత్వం పరంగా సింహం లాంటివాడని కొనియాడారు. ఈ వ్యక్తి (ఎన్టీఆర్)తో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ చమత్కరించారు.

అటు ఎన్టీఆర్ మాట్లాడుతూ, రామ్ చరణ్ పై ప్రశంసల జల్లు కురిపించాడు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రతి సీను మళ్లీ నటించడానికి తాను సిద్ధమని, అందుకు కారణం చరణ్ తో మళ్లీ సమయం గడిపే వీలుంటుందని అన్నాడు.  

దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ, ఆర్ఆర్ఆర్ చిత్రం కథ భారత గడ్డపై పుట్టిన ఓ భావోద్వేగం అని అభివర్ణించారు. రెండు ఫిరంగుల్లాంటి రామ్ చరణ్, ఎన్టీఆర్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారని కితాబునిచ్చారు. ఎన్టీఆర్ ను మిత్రుడిగా పేర్కొన్న రాజమౌళి... రామ్ చరణ్ ను తన శిష్యుడిగా అభివర్ణించారు. అయితే వ్యక్తిగత జీవితంలో స్వేచ్ఛగా ఉండడం ఎలాగో రామ్ చరణ్ నుంచి తాను నేర్చుకుంటానని సభాముఖంగా తెలిపారు.

"నేను ఎన్టీఆర్ ను తిడుతుంటాను. టైమ్ సెన్స్ ఉండదు. నేను 7 గంటలకు రమ్మంటే 6 గంటలకే వచ్చేస్తాడు. నేను ఏదైనా మనసులో ఓ సీన్ అనుకుంటే, చెప్పకముందే చేసి చూపిస్తాడు. తెలుగు తెరకే కాదు భారతీయ చిత్ర పరిశ్రమకే ఎన్టీఆర్ ఓ వరంలాంటివాడు. ఇక చరణ్ ను ఎక్కువగా మై హీరో అంటుంటాను. చరణ్ నుంచి నేను నేర్చుకున్నది ఏంటంటే... సినిమా కోసం ఎంత కావాలన్నా చేసేందుకైనా సిద్ధంగా ఉంటాడు. ఓ ధ్యానంలో ఉన్నట్టుగా ఎంతో నిర్మలమైన మనసుతో ఉంటాడు. వాస్తవానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ భిన్న ధృవాల్లాంటి వాళ్లు. ఎన్టీఆర్ ఎప్పుడూ ఓ లక్ష్యం కోసం దూసుకుపోతున్న వ్యక్తిలా కనిపిస్తాడు. రామ్ చరణ్ కచ్చితమైన వ్యక్తిత్వానికి ప్రతిరూపంలా కనిపిస్తాడు" అని వివరించారు.
Rajamouli
RRR
Pre Release Event
NTR
Ramcharan
Chennai
Tollywood

More Telugu News