Sunny Leone: సన్నీ లియోన్ నటనపై మరో వివాదం.. ‘మధుబన్’ పాటను నిషేధించాలని డిమాండ్
- ఆమె నటన అసభ్యకరం
- దాన్ని నిషేధించాలి
- సంత్ మహారాజ్ డిమాండ్
- లేదంటే కోర్టుకు వెళతామని హెచ్చరిక
సన్నీ లియోన్ అందాల ఆరబోతపై మరోసారి వివాదం నెలకొంది. ‘మధుబన్ మేన్ రాధికా నాచే’ పాటను నిషేధించాలంటూ మధురలోని (యూపీ) హిందూ సంఘాలు, మత గురువులు డిమాండ్ చేస్తున్నారు. పాటలో అసభ్యకరమైన ఆమె నటన హిందువుల మనోభావాలను గాయపరిచే విధంగా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దేవతామూర్తి అయిన రాధను అవమానించేలా ఉందంటూ నెటిజన్లు సైతం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
సన్నీలియోన్ నటించిన ఈ వీడియో మ్యూజిక్ ఆల్బమ్ ను బుధవారం సరేగమ మ్యూజిక్ విడుదల చేసింది. ఇందులో మధుబన్ పాటపైనే ప్రధానంగా వివాదం నెలకొంది. వాస్తవానికి ఈ పాటను తొలిసారిగా 1960లో కోహినూర్ చిత్రంలో మహమ్మద్ రఫీ ఆలపించారు. ‘‘సన్నీలియోన్ వీడియో ఆల్బమ్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే మేము కోర్టును ఆశ్రయిస్తాం’’ అని సంత్ నావల్ గిరి మహారాజ్ అన్నారు. సన్నివేశాల్లో ఆమెను తప్పించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
అఖిల భారతీయ తీర్థ పురోహిత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు మహేష్ పాఠక్ సైతం తీవ్రంగా స్పందించారు. ‘‘పాటలో అసభ్యకరమైన రీతిలో డ్యాన్స్ చేయడం ద్వారా సన్నీ లియోన్ బ్రిజ్ భూమి (మధుర-బృందావనం) ప్రతిష్ఠను అవమానించారు’’అని పాఠక్ పేర్కొన్నారు.