Andhra Pradesh: వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన వల్లభనేని వంశీ... రాధాతో మాటామంతీ

Vallabhaneni Vamsi Meets Vangaveeti Radha On The Sidelines Of Ranga Death Anniversary
  • ఒకే వేదికపై వంగవీటి రాధా, వల్లభనేని వంశీ 
  • ఇద్దరూ కలిసే రంగా విగ్రహానికి పూలమాల వేసిన వైనం
  • సోషల్ మీడియాలో ఫొటోలు
విజయవాడలో రాజకీయపరంగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్ర వేస్తున్న వంగవీటి రాధా, వల్లభనేని వంశీ ఓ కార్యక్రమంలో కలవడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో వైసీపీలో కొనసాగిన రాధా... ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ.. ఇప్పుడు వైసీపీకి అనుకూలంగా కొనసాగుతున్నారు. అలాంటి ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు వంగవీటి రంగా 33వ వర్ధంతి సందర్భంగా కలిశారు.

విజయవాడ బందరు రోడ్డులోని రంగా విగ్రహానికి వీరిద్దరూ పూలమాల వేశారు. అంతకుముందే రాధా కార్యాలయంలో వారు సమావేశమయ్యారు. ఇరువురి మధ్య రాజకీయ, వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చినట్టు చెబుతున్నారు. అయితే, ఏం చర్చించారన్నది మాత్రం తెలియరాలేదు. కొన్నాళ్లుగా అడపాదడపా కొన్ని కార్యక్రమాలకు హాజరవడం తప్పితే పెద్దగా ఫ్రేమ్ లో లేని రాధా... తాజాగా వల్లభనేని వంశీతో కలిసున్న ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా రాధా మాట్లాడుతూ... వంగవీటి కుటుంబాన్ని ఆదరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.  33 ఏళ్లుగా తన తండ్రి వర్ధంతిని అభిమానులు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అటు వల్లభనేని వంశీ స్పందిస్తూ... ఆశయసాధన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి వంగవీటి రంగా అని కొనియాడారు. చనిపోయినా జనం మనసుల్లో గుర్తుండిపోయే నేతలు ముగ్గురని, వారు ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వంగవీటి రంగా అని అన్నారు.
Andhra Pradesh
Vangaveeti Radha
Vangaveeti Ranga
Vallabhaneni Vamsi
Telugudesam
YSRCP

More Telugu News