TMC: మమతకు- ప్రశాంత్ కిశోర్‌కు చెడిందా? పీకేపై మమత గుర్రుగా ఉన్నారా?

No difference of opinion between party and Prashant Kishors I PAC said Trinamool
  • ఐప్యాక్ రాజకీయ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్న టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్
  • వారి పని వారు చేస్తే సరిపోతుందని వ్యాఖ్య
  • తమ క్రెడిట్‌ను పీకే కొట్టేయాలని చూస్తున్నారని గుర్రు
  • తామంతా ఒకే టీం అంటూ ఊహాగానాలకు చెక్‌పెట్టే యత్నం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తృణమూల్ కాంగ్రెస్‌ కోసం పనిచేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌తో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి చెడిందా? పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఘన విజయం, ఇతర రాష్ట్రాల్లో టీఎంసీ బలోపేతాన్ని పీకే తన ఘనతగా చెప్పుకుంటూ క్రెడిట్ కొట్టేస్తున్నారా? ఈ విషయంలో పీకే టీంపై మమత గుర్రుగా ఉన్నారా? పశ్చిమ బెంగాల్ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇవే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి.

పీకే సారథ్యంలోని ఐప్యాక్‌-టీఎంసీ మధ్య సంబంధాలు చెడినట్టు షికారు చేస్తున్న వార్తలపై టీఎంసీ ఎట్టకేలకు పెదవి విప్పింది. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని స్పష్టం చేసింది. అవన్నీ వదంతులేనని తేల్చి చెప్పింది. తామంతా ఒకే టీం అని పేర్కొంది.

అయితే, మమతకు, ఐప్యాక్‌కు మధ్య చెడిందన్న వార్తలు వెలుగులోకి వచ్చి చక్కర్లు కొడుతుండడానికి టీఎంసీ ఎంపీ  డెరెక్ ఒబ్రెయిన్ గురువారం రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలే  కారణం. పీకే నేతృత్వంలోని ఐప్యాక్‌తో తాము ఐదేళ్లపాటు ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఆ సంస్థ తమకు అప్పగించిన పనులు చేస్తే సరిపోతుందంటూ పీకే పేరును ప్రస్తావించకుండా వ్యాఖ్యానించారు. ఐప్యాక్ చేసే రాజకీయ వ్యాఖ్యలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని, అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని తేల్చిచెప్పారు.

ఐప్యాక్‌తో ఐదేళ్ల ఒప్పందం చేసుకున్న తొలి పార్టీ తమదేనని పేర్కొన్న ఒబ్రెయిన్.. తమతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ వారి పనులు వారికి ఉంటాయన్నారు. టీఎంసీకి కట్టుబడి వారి విధానాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. సోషల్ మీడియాపై ఆ పార్టీకి మంచి పట్టు ఉందన్న ఎంపీ.. ఐప్యాక్‌తో సంబంధాలపై పూర్తి నిర్ణయం మమతదేనని స్పష్టం చేసి ఊహాగానాలకు తావిచ్చారు.

కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించడం, ఇతర రాష్ట్రాల్లో ఆ పార్టీ క్రమంగా బలపడుతుండడంతో ఆ క్రెడిట్ అంతా తనదేనని ప్రశాంత్ కిశోర్ ప్రచారం చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో పీకేపై మమత గుర్రుగా ఉన్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని కూడా వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలో స్పందించిన టీఎంసీ.. అలాంటిదేమీ లేదని, తామంతా ఒకే టీం అని స్పష్టం చేసి పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది.
TMC
IPAC
Mamata Banerjee
Prashant Kishor
West Bengal

More Telugu News