adult: పరస్పర అంగీకారంతో సహజీవనం.. ప్రాథమిక హక్కుల్లో భాగమే: పంజాబ్, హర్యానా హైకోర్టు

Adult male without marriage can live with consenting partner
  • గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన ఓ జంట సహజీవనం 
  • హైకోర్టును రక్షణ కోరిన సహజీవనం చేస్తున్న జంట   
  • పురుషుడికి 21 ఏళ్లు నిండలేదని హక్కులను తోసిపుచ్చరాదన్న కోర్టు 
  • రక్షణ కల్పించాలంటూ గురుదాస్ పూర్ ఎస్ఎస్పీకి ఆదేశాలు 
చట్టబద్ధంగా వివాహం చేసుకునే వయసుకు చేరుకోక ముందు.. వయోజనుడైన వ్యక్తి  18 ఏళ్లు నిండిన మహిళతో పరస్పర అంగీకారం మేరకు వైవాహిక తరహా జీవనం (సహజీవనం) కొనసాగించుకోవచ్చని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు పేర్కొంది. 2018 మే నెలలో సుప్రీంకోర్టు ఓ కేసు విచారణలో భాగంగా జారీ చేసిన తీర్పు మాదిరే పంజాబ్ అండ్ హైకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. వయోజనులైన స్త్రీ, పురుషుడు వివాహం లేకుండానే సహజీవనం చేసుకోవచ్చంటూ నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఓ జంట రక్షణ కోరుతూ ఆశ్రయించడంతో హైకోర్టు వారికి మద్దతుగా నిలిచింది.

పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లాకు చెందిన ఓ జంట సహజీవనం సాగిస్తున్నారు. వీరిద్దరికీ వయసు 18 ఏళ్లు నిండింది. హిందూ వివాహ చట్టం ప్రకారం ఆమెకు వివాహ వయసు వచ్చింది కానీ, అతడికి 21 ఏళ్లు నిండితేనే ఆ అర్హత లభిస్తుంది. దీంతో వీరిద్దరు సన్నిహిత సంబంధాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపై ఇరు కుటుంబాలు గట్టిగా హెచ్చరించడంతో తమకు రక్షణ కల్పించాలంటూ వారు హైకోర్టును వేడుకున్నారు. తమను చంపే ప్రమాదం ఉందని కోర్టుకు నివేదించారు.

దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘రాజ్యాంగం ప్రకారం పౌరుల ప్రాణాలు, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. పిటిషనర్ (పురుషుడు) వివాహ వయసుకు చేరుకోలేదన్నది వాస్తవం. అలాగని చెప్పి భారతీయ పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను పొందకుండా చేయడం సరికాదు’’ అని పేర్కొంది. పిటిషనర్ల దరఖాస్తును పరిశీలించి, వారి ప్రాణాలకు ముప్పు ఉంటే తగిన రక్షణ కల్పించాలంటూ గురుదాస్ పూర్ ఎస్ఎస్ పీని జస్టిస్ హర్నరేష్ సింగ్ ఆదేశించారు.
adult
live together
living relation
highcourt

More Telugu News