Chandrababu: ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని: తిరుపతి సభలో చంద్రబాబు నినాదం

Chandrababu attends Farmers meeting in Tirupati
  • తిరుపతిలో రైతుల సభ
  • హాజరైన చంద్రబాబు
  • సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు
  • రైతులు చేసిన పాపమేంటి? అంటూ ఆగ్రహావేశాలు  
మహా పాదయాత్ర ముగించిన రైతులు తిరుపతిలో ఏర్పాటు చేసిన మహోద్యమ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించారు. జై అమరావతి... జై జై అమరావతి అంటూ ప్రసంగం ప్రారంభించారు. 45 రోజుల పాటు 450 కిలోమీటర్లు కాలినడకన రైతులు పాదయాత్ర చేశారని అన్నారు. అయితే, పాదయాత్రలో రైతులపై 100 కేసులు పెట్టారని ఆరోపించారు. 'ఈ రైతులు చేసిన పాపమేంటి? వారిపై అక్రమ కేసులు పెట్టిన దద్దమ్మ ప్రభుత్వం ఈ జగన్ ప్రభుత్వం' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నాడు అమరావతిని రాజధానిగా చేసేందుకు నిర్ణయించి భూములు ఇవ్వాలని రైతులను కోరితే వారు వెంటనే స్పందించారని అన్నారు. తన వద్ద నిధులు లేకపోయినా హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం ఉందని చెప్పానని, రైతులు ముందుకొచ్చి భూములను త్యాగం చేశారని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలు కూడా ఇవాళ సభావేదికపై ఉన్నారని వివరించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారని ప్రస్తావించారు. సీపీఐ నారాయణ, రామకృష్ణ మొదటి నుంచి రైతులకు సంఘీభావం ప్రకటిస్తున్నారని వివరించారు.

"జగన్ మోహన్ రెడ్డి గారూ, మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? నాడు అసెంబ్లీలో ఏం చెప్పారు? అమరావతినే రాజధానిగా పెట్టాలని మీరు చెప్పలేదా? మనకు 13 జిల్లాలే ఉన్నాయని, చిన్న రాష్ట్రం అయిందని, ప్రాంతాల మధ్య, కులాల మధ్య చిచ్చుపెట్టడం తనకు ఇష్టంలేదని, అయితే కనీసం 30 వేల ఎకరాలన్నా రాజధానికి ఉండాలని మీరు ఆనాడు చెప్పలేదా? ఇవాళ 33 వేల ఎకరాలు రైతులు ఇచ్చారు. మడమ తిప్పను, మాట తప్పను అనే జగన్ రెడ్డిని ఇప్పుడు అడుగుతున్నా. అమరావతిపై మాట తప్పారా? లేదా? మడమ తిప్పారా? లేదా?

అమరావతిపై కుల ముద్ర వేసే పరిస్థితికి వచ్చారు. ఇవాళ సభకు అన్ని పార్టీల వారు వచ్చారు... వీరంతా ఏ కులం వాళ్లు? ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని అమరావతి రాజధాని కావాలని కోరుతున్నారు. 5 కోట్ల మందికి చెందిన ప్రజా రాజధాని ఇది. ఇది ఏ ఒక్కరిదో, జగన్ రెడ్డిదో కాదు... ప్రజలు కోరుకున్న రాజధాని. అలాంటి రాజధానిపై ఇష్టానుసారం వ్యవహరిస్తూ మూడు ముక్కలాట ఆడతారా? ఏమనుకుంటున్నారు మీరు?" అంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అమరావతి ముంపు ప్రాంతం అన్నారు... ఈ మూడేళ్లలో ఒక్కసారైనా మునిగిపోయిందా? ఇన్ సైడర్ ట్రేడింగ్ అన్నారు... చివరికి ఇలాంటివేవీ లేవని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా చెప్పాయి. వెంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా... నువ్వెన్నయినా కేసులు పెట్టుకో... కానీ మేం ధర్మపోరాటం చేస్తున్నాం. ధర్మపోరాటంలో గెలిచేది అమరావతి ప్రజలే. అమరావతి రైతులు ఐదు కోట్ల ఆంధ్రుల కోసం పోరాడుతున్నారు" అంటూ స్పష్టం చేశారు.

"నాడు హైదరాబాద్ ను అభివృద్ధి చేశాం, సైబరాబాద్ ను ఏర్పాటు చేశాం. ఏం, హైదరాబాద్ నాకోసం అభివృద్ధి చేసుకున్నానా? ఏపీలోనూ అమరావతిని అదే స్థాయిలో అభివృద్ధి చేయాలనుకున్నాం. రాష్ట్రంలో ఎక్కడ్నించి చూసినా మధ్యలో ఉండే ప్రదేశం అమరావతి. ఎక్కడ్నించైనా సులభంగా చేరుకోగలిగే ప్రాంతం. నువ్వు ఇంట్లో కూర్చున్నా సరే, అమరావతిని చెడగొట్టకుండా, ధ్వంసం చేయకుండా ఉంటే చాలు... అమరావతి అద్భుతరీతిలో అభివృద్ధి చెందుతుంది" అంటూ సీఎం జగన్ కు హితవు పలికారు.

ప్రసంగం ముగిస్తూ 'ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని' అంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లోనూ జరగాలని, రాజధాని మాత్రం అమరావతిలో మాత్రమే ఉండాలని చంద్రబాబు ఉద్ఘాటించారు.
Chandrababu
Amaravati
CM Jagan
Tirupati
AP Capital
Andhra Pradesh

More Telugu News