Florence Parly: మరిన్ని రాఫెల్ విమానాలు కావాలంటే చెప్పండి... ఇస్తాం: ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే

France defense minister Florence Parly said if India wants more Rafales they ready to deliver
  • రాఫెల్ విమానాల కోసం ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందం
  • 36 విమానాల కోసం డీల్
  • ఇప్పటివరకు 33 విమానాల అందజేత
  • 2022 ఏప్రిల్ నాటికి మిగిలిన 3 విమానాల రాక

భారతదేశ రక్షణ పాటవాన్ని అమాంతం పెంచేసిన అస్త్రం... రాఫెల్ యుద్ధ విమానం. ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఈ రాఫెల్ యుద్ధ విమానాలతో శత్రుదేశ విమానాలు, ఇతర లక్ష్యాలపై గురితప్పకుండా దాడులు చేయవచ్చు. గగనతల ఆధిపత్యంలో రాఫెల్ ను మించింది లేదు అని రక్షణ రంగ నిపుణులు చెబుతుంటారు. భారత్ 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం ఫ్రాన్స్ తో 2016లో ఒప్పందం కుదుర్చుకుంది.

కాగా, ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్నారు. పార్లే మాట్లాడుతూ, మరిన్ని రాఫెల్ విమానాలు కావాలని భారత్ అడిగితే, ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్, భారత్ ల శక్తికి ప్రతీకలుగా నిలుస్తాయని, సిసలైన ఆస్తిగా పేర్కొనదగ్గ పోరాట విమానాలు అని అభివర్ణించారు.

రాఫెల్ విమానాల పనితీరు పట్ల భారత వాయుసేన సంతృప్తి వ్యక్తం చేయడం హర్షణీయమని పార్లే పేర్కొన్నారు. భారత వాయుసేన అవసరాలు తీర్చేందుకు తాము ఆసక్తి చూపుతున్నామని ఆమె స్పష్టం చేశారు.

ఐదేళ్ల కిందట ఫ్రాన్స్ తో 36 రాఫెల్ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకోగా, ఇప్పటివరకు పలు దఫాలుగా 33 విమానాలు సరఫరా చేశారు. మిగిలిన 3 విమానాలు ఫ్రాన్స్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి అందజేయనుంది. ఈ నేపథ్యంలో భారత్ తో రాఫెల్ విమానాల ఒప్పందం పొడిగింపునకు ఫ్రాన్స్ దేశం ఆసక్తిగా ఉన్నట్టు ఆ దేశ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. పార్లీ తన పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు.

  • Loading...

More Telugu News