Andhra Pradesh: ఇంకా ఆసుప‌త్రిలోనే రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ.. నేడు విచార‌ణ‌కు హాజ‌రు కావడంపై సందిగ్ధం!

lakshmi narayana still in hospital
  • ఇటీవ‌ల ఆయ‌న ఇంట్లో సోదాలు
  • నేడు విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు
  • వైద్యులు డిశ్చార్జ్‌ చేస్తే  సీఐడీ ఆఫీసుకు ల‌క్ష్మీనారాయ‌ణ‌
  • హైకోర్టులో ఇప్ప‌టికే ముందస్తు బెయిల్ పిటిష‌న్
చంద్రబాబు నాయుడి వ‌ద్ద గ‌తంలో ఆయ‌న ఓఎస్డీగా పనిచేసిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ లక్ష్మీనారాయణ నివాసంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఐడీ అధికారులు ఇటీవ‌ల‌ సోదాలు జ‌రిపిన విష‌యం తెలిసిందే. చంద్రబాబు నాయుడి హయాంలో ఐటీ సలహాదారుగాను, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ, సీఈవోగా వ్యవహరించిన గంటా సుబ్బారావు ఫాంహౌస్‌లోనూ సీఐడీ అధికారులు సోదాలు చేశారు.

ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కార్యకలాపాల్లో అక్రమాలు జరిగాయంటూ ఈ సోదాలు జ‌రిగాయి. అనంత‌రం రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి లక్ష్మీనారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నేడు ఆయ‌న విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సి ఉంది. అయితే, అయితే, ప్రస్తుతం హైదరాబాద్‌లోని స్టార్ హాస్పిట‌ల్‌లో ఆయ‌న చికిత్స పొందుతున్నారు. ఈ నెల 10వ తేదీన ఇంట్లో సీఐడీ సోదాల నేప‌థ్యంలో ఆయన స్పృహ తప్పి పడిపోయారు.

వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆయన అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు. లక్ష్మీనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించిన త‌ర్వాత ఆయ‌న విచార‌ణ‌కు వెళ్లే అంశంపై స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ ఆయ‌న‌ను వైద్యులు డిశ్చార్జ్‌ చేస్తే ఆయన మంగళగిరిలోని సీఐడీ ఆఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది.

మరోపక్క, ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో ల‌క్ష్మీనారాయ‌ణ‌ లంచ్‌ మోషన్ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచార‌ణకు హైకోర్టు అనుమతించింది. ఈ రోజు మధ్యాహ్నం ఆ పిటిష‌న్‌ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Andhra Pradesh
Hyderabad
AP High Court

More Telugu News