MI-17V5: తమిళనాడులో కూలిపోయిన హెలికాప్టర్ కు ఘన చరిత్ర!

The helicopter crashed in Tamilnadu had a good reputation as VVIP Chopper
  • నీలగిరి వద్ద  సీడీఎస్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిపోయిన వైనం
  • 13 మంది దుర్మరణం
  • ఆసుపత్రిలో ఒకరికి చికిత్స
  • అత్యంత భద్రమైన హెలికాప్టర్ గా ఎంఐ-17వి5కి గుర్తింపు
  • వీవీఐపీలు ప్రయాణించే హెలికాప్టర్
తమిళనాడులో ఈ మధ్యాహ్నం సైనిక హెలికాప్టర్ కూలిపోవడం తెలిసిందే. దీంట్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్, అర్ధాంగి కూడా ఉండడం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో 14 మంది ఉండగా, 13 మంది మరణించారన్న వార్త నివ్వెరపరుస్తోంది.

అయితే, ఈ ప్రమాదంలో కూలిపోయిన హెలికాప్టర్ ఎంతో సురక్షితమైనదిగా త్రివిధ దళాల్లో గుర్తింపు ఉంది. నీలగిరి వద్ద కూలిపోయిన హెలికాప్టర్ ఎంఐ-17వి5 రకానికి చెందినది. ఎంఐ సిరీస్ లో ఇదే అత్యంత భద్రమైన హెలికాప్టర్ గా భావిస్తుంటారు. దేశంలో ప్రభుత్వ సంబంధిత ప్రముఖుల ప్రయాణాలకు దీన్నే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ప్రధాని మోదీ సైతం స్వల్ప దూర పర్యటనలకు ఈ ఎంఐ-17వి5 హెలికాప్టర్ లోనే వెళుతుంటారు.

ఇది ఒక్కసారి ఇంధనం నింపుకుంటే 580 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రమాదాలు జరగకుండా ఇందులో పలు ఏర్పాట్లు ఉన్నాయి. ఫ్యూయల్ ట్యాంక్ లీకేజిల నివారణ, మంటలు అంటుకోకుండా ఏర్పాట్లు దీంట్లో ఉన్నాయి. ఒకవేళ మంటలు వ్యాపిస్తే పాలియురేథిన్ సింథటిక్ ఫోమ్ కవచంలా పనిచేస్తుంది. దీంట్లో గరిష్ఠంగా 36 మంది వరకు ప్రయాణించే వీలుంది. మోడరన్ ఏవియానిక్స్ కారణంగా ఎలాంటి వాతావరణంలోనైనా, సముద్రాలు, అటవీప్రాంతాలు, ఎడారులపైనా ప్రయాణించే సత్తా ఎంఐ-17వి5 సొంతం.

ఇది రష్యా తయారీ మీడియం క్లాస్ హెలికాప్టర్. ఈ హెలికాప్టర్ కు పెద్దగా ప్రమాద చరిత్ర కూడా లేదు. కొన్నాళ్ల కిందట బాలాకోట్ దాడుల అనంతరం.... భారత్ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టమ్ పొరబాటు కారణంగా కూలిపోయింది. అంతేతప్ప సాంకేతిక లోపాలతో కుప్పకూలిన ఘటన గతంలో లేదు.

అయితే నీలగిరి వద్ద ఈ హెలికాప్టర్ ఎలా ప్రమాదానికి గురైందన్నది ఇంకా తెలియరాలేదు. పర్వతప్రాంతంలో హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి కుప్పకూలి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
MI-17V5
Helicopter
Crash
Tamil Nadu
Army
India

More Telugu News