Bipin Rawat: హెలికాప్టర్ లోని 14 మందిలో 13 మంది దుర్మరణం.. ప్రాణాలతో ఉన్న ఆ ఒక్కరు ఎవరు?

13 of 14 dead in army helicopter crash
  • తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్ 
  • మంటల్లో ఆహుతి అయిన ప్రయాణికులు
  • బిపిన్ రావత్ ను ఆసుపత్రికి తరలించిన వైనం
తమిళనాడులో చోటు చేసుకున్న ఘోర హెలికాప్టర్ ప్రమాదం యావత్ దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచెత్తుతోంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో పాటు 14 మంది ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఊటీ ప్రాంతంలోని కూనూరు ప్రాంతంలో కుప్పకూలిన సంగతి తెలిసిందే.

ఈ ప్రమాదంలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్నవారు మంటల్లో కాలిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టనంతగా కాలిపోయాయి. మొత్తం 14 మందిలో 13 మంది మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. రావత్ సతీమణి మృతి చెందినట్టు తొలుతే వార్తలు వచ్చాయి. అయితే ఇంకా ప్రాణాలతో ఉన్న ఆ 14వ వ్యక్తి ఎవరనే ప్రశ్న ఉత్కంఠను పెంచుతోంది.

మరోవైపు ప్రమాదం సంభవించిన తర్వాత బిపిన్ రావత్ ను అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ బయటకు వచ్చాయి. కాలిన శరీరంతో ఒంటిపై బట్టలు లేకుండా ఆయన ఉన్నారు (కాలిపోతున్న దుస్తులను బహుశా ఆయనే తొలగించి ఉండొచ్చు). బిపిన్ రావత్ కు వెల్లింగ్టన్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఇప్పటికీ ప్రాణాలతో ఉన్న వ్యక్తి బిపిన్ రావతే కావచ్చని.. ఆయన ప్రాణాలతో బయటపడాలని యావత్ దేశం కోరుకుంటోంది. అయితే ఆ 14వ వ్యక్తి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు డీఎన్ఏ టెస్టు ద్వారా మృతదేహాలను గుర్తించనున్నట్టు తెలుస్తోంది.
Bipin Rawat
Army Helicopter
Crash

More Telugu News