Nikki Hembrom: ​నన్ను ఉద్దేశించి "బ్యూటిఫుల్" అన్నారు... సీఎం నితీశ్ కుమార్ పై బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఆరోపణ

BJP legislature Nikki Hembrom made allegations on CM Nitish Kumar
  • అనూహ్య వివాదంలో బీహార్ సీఎం
  • ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో ఘటన
  • గిరిజనుల ఉపాధిపై మాట్లాడానని నిక్కీ హెంబ్రోమ్ వెల్లడి
  • సీఎం అభ్యంతరకర వ్యాఖ్య చేశారని ఆరోపణ
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఊహించని రీతిలో ఓ వివాదంలో చిక్కుకున్నారు. తనను ఉద్దేశించి సీఎం నితీశ్ కుమార్ "బ్యూటిఫుల్" అంటూ వ్యాఖ్యానించారని బీజేపీ మహిళా ఎమ్మెల్యే నిక్కీ హెంబ్రోమ్ ఆరోపణలు చేశారు. ఎన్డీయే శాసనసభాపక్ష సమావేశంలో తాను గిరిజనుల ఉపాధి గురించి మాట్లాడానని నిక్కీ వెల్లడించారు. గిరిజనుల్లో కొందరు మద్యం తయారీ బాట పట్టారని, వారికి ఉపాధి చూపించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నానని తెలిపారు. అందుకు సీఎం నితీశ్ కుమార్ స్పందించి "బ్యూటిఫుల్" అంటూ కామెంట్ చేశారని నిక్కీ వెల్లడించారు.

సీఎం అంతటివాడు అలా వ్యాఖ్యానించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. ఆయన ప్రవర్తన అభ్యంతరకరంగా ఉందని భావిస్తున్నానని నిక్కీ హెంబ్రోమ్ తెలిపారు. ఈ అంశాన్ని బీజేపీ సీనియర్ నేతలకు వెల్లడించినట్టు ఆమె పేర్కొన్నారు.

కాగా ఈ వ్యవహారంపై సీనియర్ రాజకీయవేత్త లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య స్పందిస్తూ... ఈ వయసులో ఇదేం ప్రవర్తన? అంటూ వ్యాఖ్యానించారు. అయితే, జేడీయూ మహిళా నేత ఒకరు స్పందిస్తూ, నిక్కీ హెంబ్రోమ్ పొరబడ్డారని, ఆమెను కించపర్చాలని ఆయన ఆ వ్యాఖ్య చేయలేదని స్పష్టం చేశారు. సీఎం నితీశ్ కుమార్ కు మహిళలంటే ఎంతో గౌరవం ఉందని తెలిపారు.
Nikki Hembrom
CM Nitish Kumar
Beautiful
Bihar

More Telugu News