Piyush Goyal: ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు: కేంద్రమంత్రి పియూష్ గోయల్

Piyush Goyal stated that Telangana govt must obey MoU
  • ధాన్యం కొనుగోలు అంశంపై టీఆర్ఎస్ ప్రశ్న
  • రాజ్యసభలో బదులిచ్చిన కేంద్రమంత్రి పియూష్ గోయల్
  • ఎంఓయూకు తెలంగాణ కట్టుబడి ఉండాలని హితవు
  • తెలంగాణనే ఇంకా ధాన్యం పంపించాలని వెల్లడి
  • గందరగోళం సృష్టిస్తోందంటూ అసహనం
పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ సభ్యుడు కె. కేశవరావు నేడు రాజ్యసభలో ధాన్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. అందుకు కేంద్రమంత్రి పియూష్ గోయల్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. వానాకాలం పంటను పూర్తిగా కొంటామని వెల్లడించారు. గతంలో తెలంగాణతో చేసుకున్న ఒప్పందం (ఎంఓయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు ఉంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ తోనూ చర్చించినట్టు గోయల్ తెలిపారు.

ముందు చేసుకున్న ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రంతో మొదట 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు ఒప్పందం కుదిరిందని, అనంతరం ఆ ఒప్పందాన్ని 44 లక్షల టన్నుల సేకరణకు పెంచామని కేంద్రమంత్రి పియూష్ గోయల్ వెల్లడించారు.

దాని ప్రకారం ఇప్పటివరకు 27 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి వచ్చిందని, ఇంకా 17 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ రావాల్సి ఉందని స్పష్టం చేశారు. అంత ధాన్యం పంపించకుండా పెండింగ్ లో ఉంచిన తెలంగాణ ప్రభుత్వం... కేంద్రాన్ని ప్రశ్నిస్తుండడం అర్థరహితమని విమర్శించారు.  

మున్ముందు కాలంలో బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయబోమన్న అంశాన్ని గత ఒప్పందంలోనే పేర్కొన్నామని పియూష్ గోయల్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ ఈ అంశంపై పదేపదే ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ గందరగోళం సృష్టిస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

అటు, ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల టన్నుల ధాన్యం ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం 32.66 లక్షల టన్నులే ఇచ్చిందని వెల్లడించారు. ధాన్యం సేకరణ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ధాన్యం సేకరణ అంశంలో కర్ణాటక అనుసరిస్తున్న విధానం చాలా బాగుందని, ఇతర రాష్ట్రాలు కూడా ఆ నమూనాను పరిశీలించి, అనుసరించాలని సూచించారు.
Piyush Goyal
Telangana Govt
Paddy
Boiled Rice

More Telugu News