China: పెంగ్ ఆచూకీ కనిపెట్టాలంటూ చైనాపై అంతర్జాతీయ ఒత్తిడి.. సోషల్ మీడియాలో దర్శనమిచ్చిన టెన్నిస్ క్రీడాకారిణి

UN challenged Chinese authorities to provide undisputable evidence of Peng Shuai
  • ప్రభుత్వ మాజీ ఉద్యోగి ఒకరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని పెంగ్ ఆరోపణ
  • వీచాట్‌లో దర్శనమిచ్చిన ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ చానల్ ఉద్యోగి
  • పెంగ్ అదృశ్యంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన
  • ఆమె సురక్షితంగా లేకుంటే చైనాలో టోర్నీలు నిర్వహించబోమన్న డబ్ల్యూటీఏ చైర్మన్
చైనా ప్రభుత్వ మాజీ ఉద్యోగి ఒకరు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపించి, ఆపై కనిపించకుండా పోయిన ఆ దేశానికి చెందిన డబుల్స్ నంబర్ వన్ టెన్నిస్ క్రీడాకారిణి పెంగ్ షువాయి తాజాగా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. పిల్లితో ఆడుకుంటున్నట్టున్న ఫొటోలు ‘వీచాట్’ అనే సోషల్ మీడియాలో కనిపించాయి. సీజీటీఎస్ చానల్ ఉగ్యోగి షెన్ షీవీ ఈ ఫొటోలను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. వీచాట్‌లో పెంగ్ ఈ ఫొటోలను స్వయంగా పోస్టు చేశారని ఈ సందర్భంగా షెన్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఆమె తన ఇంట్లోనే స్వేచ్ఛగా ఉన్నట్టు ఈ ఫొటోలు చెబుతున్నాయని చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఎడిటర్ హూ జిజిన్ పేర్కొన్నారు. పెంగ్ తనకు ఎలాంటి ఆటంకం కలగకూడదని భావిస్తోందని, త్వరలోనే ఆమె బయటకు వస్తుందని పేర్కొన్నారు. మరోవైపు, పెంగ్ అదృశ్యమైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా టెన్నిస్ వర్గాల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆమె ఆచూకీ కనుగొనాలంటూ చైనాపై ఒత్తిడి పెరుగుతోంది.

పెంగ్ క్షేమ సమాచారంపై సాక్ష్యాలు చూపించాలని అమెరికా ప్రభుత్వం కోరుకుంటోందని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి జెన్ సాకి పేర్కొన్నారు. పెంగ్ ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరగాలని ఐక్యరాజ్య సమితి డిమాండ్ చేసింది. పెంగ్ కనుక సురక్షితంగా లేకపోతే చైనాతో ఒప్పందం రద్దు చేసుకుంటామని, అక్కడ ఇకపై ఎలాంటి టోర్నీలు నిర్వహించబోమని డబ్ల్యూటీఏ చైర్మన్ సిమన్స్ ఇది వరకే హెచ్చరించారు. వచ్చే ఏడాది చైనా వింటర్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో పెంగ్ అదృశ్యం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
China
Peng Shuai
Tennis
USA
UN
WTA

More Telugu News