NIA: రెండేళ్ల క్రితం నాటి ఎదురు కాల్పుల కేసు.. తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల ఎన్ఐఏ ఏకకాలంలో దాడులు

NIA conduct Searches in Telangana and Andhrapradesh in same time
  • 28 జులై 2019న బస్తర్‌లో ఎన్‌కౌంటర్
  • ఆరుగురు మావోలు, ఒక పౌరుడు మృతి
  • హైదరాబాద్, మెదక్, నెల్లూరు, విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో ప్రజా సంఘాల నేతల ఇళ్లపై దాడులు
  • తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు కె.రవిచందర్ ఇంటి తాళం పగలగొట్టి మరీ తనిఖీ
రెండు సంవత్సరాల క్రితం 28 జులై 2019లో చత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా నాగర్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థానిక పోలీసులు, సీఆర్‌పీఎఫ్ దళాలకు.. మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పులకు సంబంధించిన కేసులో తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ రంగంలోకి దిగింది. నిన్న ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లోని 14 చోట్ల పలువురు ప్రజాసంఘాల నాయకుల ఇళ్లలో సోదాలు నిర్వహించింది.

దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. సోదాల సమయంలో ఎవరినీ బయటకు వెళ్లేందుకు కానీ, లోపలికి వచ్చేందుకు కానీ అధికారులు అనుమతించలేదు. తనిఖీల సందర్భంగా పలువురి ఇళ్ల నుంచి ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లు, సెల్‌ఫోన్లు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, ఎన్ఐఏ హైదరాబాద్ బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

నాటి ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు, ఓ పౌరుడు మృతి చెందారు. ఈ కేసులో సంజు అలియాస్ పండు, లక్ష్మణ్, మున్ని, దశరితోపాటు 40 మంది నిందితులుగా ఉన్నారు. ఈ ఏడాది మార్చి 18న ఈ కేసు ఎన్ఐఏకి బదిలీ అయింది. కేసు దర్యాప్తులో భాగంగానే అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు.

హైదరాబాద్ వనస్థలిపురంలో తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు కె.రవిచందర్ ఇంటి తాళం పగలగొట్టి లోపలికి ప్రవేశించి సోదాలు చేశారు. అలాగే, హిమాయత్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్న లా విద్యార్థిని పద్మ, నాగోల్‌లో హిందూ ఫాసిస్టు దాడి వ్యతిరేక వేదికకు చెందిన నార్ల రవిశర్మ, బి.అనూరాధ, హిమాయత్‌నగర్‌లో రచయిత అరుణాంక్ లత, అల్వాల్‌లో అమరవీరుల బంధుమిత్రుల సంఘానికి చెందిన పద్మకుమారి, భవాని ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని విరసం నేత కల్యాణరావు ఇంట్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు జరిగాయి. చీరాలకు చెందిన చేనేత సంఘం నాయకుడు మాచర్ల మోహన్‌రావు, విజయవాడలో విరసం నేతలు ఎం.శ్రీనివాసరావు అరసవెల్లి కృష్ణ, ప్రజా కళాకారుడు డప్పు రమేశ్ తదితరులతోపాటు విశాఖపట్టణం, నెల్లూరు, మెదక్ జిల్లాల్లో తనిఖీలు నిర్వహించారు.
NIA
Chhattisgarh
Bastar
Encounter
Maoists

More Telugu News