YS Jagan: విచారణ వాయిదా కోరితే రోజుకు రూ. 50 వేలు కట్టాల్సిందే: జగన్‌ అక్రమాస్తుల కేసులో తెలంగాణ హైకోర్టు హెచ్చరిక

telangana high court serious about Jagan Disproportionate Assets Case
  • వాదనలు వినిపించేందుకు గడువు కావాలన్న పునీత్ దాల్మియా తరపు న్యాయవాది
  • జగన్ హాజరు మినహాయింపు పిటిషన్ విచారణ వాయిదా కోరిన జగన్ తరపు న్యాయవాది
  • ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసు నిందితులను తెలంగాణ హైకోర్టు తీవ్ర స్వరంతో హెచ్చరించింది. చీటికి మాటికి విచారణను వాయిదా వేయాలని కోరడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవాదులందరి అంగీకారంతోనే పెండింగు కేసుల విచారణ ప్రారంభమైందని, ఇప్పుడు ఏదో ఒక కారణంతో విచారణ వాయిదా వేయమనడం సరికాదని అసహనం వ్యక్తం చేసింది. ఇకపై తప్పనిసరిగా వాదనలు వినిపించాల్సిందేనని, లేదంటే రోజుకు రూ. 50 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది.

జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై నమోదైన కేసులను కొట్టివేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లతోపాటు ఇతర పిటిషన్లపై ధర్మాసనం నిన్న విచారణ చేపట్టింది.  ఇందులో భాగంగా దాల్మియా సిమెంట్స్‌కు చెందిన పునీత్ దాల్మియా దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఆయన తరపు న్యాయవాది కోరారు.  వివాహం కారణంగా విచారణ వాయిదా వేయాలని కోరారు. అలాగే, జగన్ హాజరు మినహాయింపునకు సంబంధించిన పిటిషన్‌లో వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది హాజరు కావాల్సి ఉందని, కాబట్టి ఒక రోజు వాయిదా వేయాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.

వీరి అభ్యర్థనలపై న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 16న న్యాయవాదుల అంగీకారంతోనే విచారణ చేపట్టామని, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక సాకుతో విచారణ వాయిదా కోరడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసులు విచారణకు వచ్చినప్పుడు వాదనలు వినిపించాల్సిందేనని, లేదంటే రోజుకు రూ. 50 వేల చొప్పున హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించేలా ఆదేశాలు ఇస్తామని హెచ్చరించారు.

ఆ తర్వాత వాన్‌పిక్ కేసులో ఆరో నిందితుడైన ఐఆర్ఎస్ మాజీ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సీనియర్ న్యాయవాది వినోద్‌కుమార్ దేశ్‌పాండే వాదనలు వినిపించారు. అనంతరం ఈ నెల 22కు విచారణను వాయిదా వేశారు.
YS Jagan
Jagan Disproportionate Assets Case
TS High Court
Dalmia Cements

More Telugu News