YSRCP: వివేకా హత్యతో అవినాష్ రెడ్డికి సంబంధం ఉందని నిరూపిస్తే మేమంతా రాజీనామా చేస్తాం: ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు

Proddatur MLA Rachamllu sensational Comments on ys viveka murder
  • డబ్బు, అనుమానం, వ్యక్తిగత బలహీనతలే వివేకా హత్యకు కారణం
  • తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి, తర్వాత ఇచ్చిన దానికి సంబంధం లేదు
  • ముద్దాయిని సాక్షిగా మార్చాలనుకోవడం సరికాదు
  • అవినాష్‌రెడ్డికి సంబంధం ఉందని నిరూపిస్తే 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా
డబ్బు, అనుమానం, వ్యక్తిగత బలహీనతలే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు కారణాలని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ఆయన హత్య విషయంలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, ఉందని కనుక నిరూపిస్తే తనతో సహా జిల్లాలోని 9 మంది ఎమ్మెల్యేలం రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని అన్నారు.

 ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో నిన్న విలేకరులతో మాట్లాడిన రాచమల్లు.. ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి తొలుత ఇచ్చిన వాంగ్మూలానికి, ఆ తర్వాత ఇచ్చిన దానికి పొంతన లేదన్నారు. సిట్, సీబీఐ దర్యాప్తులో భాగంగా ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం 161లో అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శంకర్‌రెడ్డిల పేర్లు లేవని, కానీ ఆ తర్వాత ప్రొద్దుటూరు కోర్టులో మేజిస్ట్రేట్ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం 164లో మాత్రం ఆ నలుగురి పేర్లను చేర్చారని రాచమల్లు పేర్కొన్నారు.

వివేకా హత్యలో పాల్గొన్నట్టు చెప్పిన డ్రైవర్ దస్తగిరిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. అతడిని అప్రూవర్‌గా మార్చేందుకే హైకోర్టులో పిటిషన్ వేశారని విమర్శించారు. ముద్దాయిని సాక్షిగా మార్చాలనుకోవడం సరికాదన్నారు.

కాగా, వివేకానందరెడ్డి హత్యకేసులో దస్తగిరి తరపున సీబీఐ వేసిన అప్రూవర్ పిటిషన్‌పై న్యాయవాదులు నేడు కోర్టులో కౌంటర్ దాఖలు చేయనున్నారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎర్ర గంగిరెడ్డి బెయిలు రద్దు పిటిషన్‌పై కడప సబ్ కోర్టులో విచారణ ఎల్లుండి (19)కి వాయిదా పడింది.
YSRCP
YS Vivekananda Reddy
Rachamallu Siva Prasad Reddy
Y. S. Avinash Reddy

More Telugu News